మదనపల్లె టౌన్ : తాగునీటి కోసం ఇరువర్గాలు ఘర్షణ పడిన సంఘటన మంగళవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు.. మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరి వాండ్లపల్లెకు చెందిన క్రిష్ణమ నాయుని భార్య పుష్పావతి(60), లోకేశ్వరి(20)లు వీధిలో ఉన్న కుళాయి వద్దకు తాగునీళ్లు పట్టుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన మల్లయ్యకు అక్కడ ఉన్న మహిళలు దారి ఇవ్వకుండా ఉండటంతో ఆయన పుష్పావతి, లోకేశ్వరిలపై గొడవకు వెళ్లాడు. మాటకుమాట పెరిగి ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన మల్లయ్య తన వద్ద ఉన్న కొడవలితో దాడి చేయడంతో పుష్పావతి, లోశ్వరి గాయపడ్డారు. ప్రతి దాడిలో మల్లయ్య, ఆయన భార్య లక్షుమ్మ సైతం తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు బాధితులను చికిత్సల కోసం వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించడంతో కోలుకుంటూ ఉన్నారు.
సబ్ రిజిస్ట్రార్‌తోపాటు మరో ఇద్దరు సస్పెన్షన్
లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లి సబ్ రిజిస్ట్రార్ సి.రామాంజులతోపాటు గతంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన ఎ.సురేష్, ప్రస్తుత జూనియర్ అసిస్టెంట్ బి.ప్రశాంతిలను సస్పెండ్ చేస్తూ మంగళవారం కడప రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ రామలక్ష్మీ పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. 22ఏ పరిధిలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములను డబ్బులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్, ఐజీ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలో బట్టబయలు కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. తంబళ్లపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఉదయ్ కిరణ్‌రెడ్డిని లక్కిరెడ్డిపల్లి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆటో బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు
సిద్దవటం : సిద్దవటం– భాకరాపేట ప్రధాన రహదారి అయ్యప్పస్వామి గుడి సమీపాన భాకరాపేట నుంచి సిద్దవటంకు వస్తున్న ఆటో .. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి అదుపు తప్పి మంగళవారం బోల్తా పడింది. ఆటో డ్రైవర్ భవనాసి వెంకటేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి.


