మదనపల్లె టౌన్ : మహిళను వేధింపులకు గురిచేసి, ఆపై సంఘ బహిష్కరణ చేయడంతో ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధితురాలి తల్లి ఎండి విజయశ్రీ తెలిపిన వివరాలు.. కొత్తపల్లె గ్రామం శాంతిపురానికి చెందిన మోసెస్ భార్య లీనా(30) సీఎస్‌ఐ ఎస్టీ పాల్ చర్చికి సభ్యురాలుగానూ, సీ్త్రల మైత్రిలో చురుగ్గానూ ఉంటోంది. సంఘం డబ్బును చర్చి పాస్టర్ యషియ, సరిత, రజిత, రవి, శారద, వినోద్ తదితరులు అనవసరంగా ఖర్చు చేస్తుండడంతో లీనా అడ్డుకుందని ఆమెను వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. డబ్బులు ఇవ్వకుండా నిరాకరించడంతో సంఘానికి నీవు పనికి రావని పాస్టర్ చర్చిలోనే లీనాను సంఘ బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించాడని తెలిపింది. దీంతో తన కూతురు వారం రోజులుగా చర్చికి కూడా వెళ్లకుండానే ఇంట్లోనే మధనపడుతూ కుమిలిపోయి చనిపోవాలని చిన్న మనసు చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా బాధలో ఉండగానే వారంతా లీనా ఇంటికి వెళ్లి పరుష పదజాలంతో దూషించడాన్ని జీర్ణించుకోలేక ఇంట్లో ఉన్న బీపీ, షుగర్, నిద్ర మాత్రలు కలిపి మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని వెటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సలు అందించారు. లీనాను సంఘ బహిష్కరణ చేసిన ఘటపై పోలీసులు లోతుగా విచరణ చేపట్టి బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.


