కురబలకోట : జలధార కింద నిండిన మండలంలోని రంగమ్మ చెరువును సీఏడీఏ కమిషనర్ ప్రశాంతి మంగళవారం పరిశీలించారు. ఈ చెరువుకు ఎగువున్న నాలుగు కాలువలను ముందుగా ఉపాధి హామీ కింద రూ.4.53 లక్షలతో బాగు చేయడంతో వర్షపు నీరు చెరువులోకి సునాయసంగా నిండిందని అధికార యంత్రాంగం తెలియజేశారు.
ఇందులో ఓ కాలువ ద్వారా హంద్రీనీవా నీటిని వదలడంతో ఈ చెరువు నిండడంతోపాటు పక్క మండలంలోని సీటీఎం చెరువు కూడా నిండిందని తెలిపారు. చెరువు కిందనే కాకుండా మొరవ నీటి ద్వారా కాలువ పరివాహక ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు పెరగడం ఆపై బోర్లులో నీటి మట్టం పెరిగిందన్నారు. తాగు సాగునీటి సమస్య లేకుండా ఉందని తెలియజేశారు. దీంతో ఆమె సంతోషించారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేసేలా చూడడం జరుగుతుందని కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో కూడా మాట్లాడారు. ఆయకట్టు ద్వారా సాగు శాతం పెరిగిందని రైతులు తెలియజేశారు. మూగజీవాలకు తాగునీరు, పశుగ్రాస పెంపకం చేపట్టినట్లు తెలిపారు. ఉద్యాన పంటలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు ఆమె తెలిపారు.


