మదనపల్లె: సీఎం చంద్రబాబునాయుడు తన స్వార్ధ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తెలంగాణకు తాకట్టు పెట్టారని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు సాధించుకుందామని వైఎస్సార్‌సీపీ మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆదేశాల మే రకు స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాలులో మంగళవారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్య నేత లతో సదస్సు జరుగుతుందని తెలిపారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేస్తారని, రాజంపేట ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, రమేష్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీకులు సురేష్‌బాబు, ఇతర ముఖ్య నేతలు హజరవుతున్నట్టు చెప్పారు. ఈ సదస్సులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సాధన కోసం భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చిస్తామని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత, రాయలసీమ ప్రాంతానికి నీటి అవసరాలు, సాగునీటి విస్తరణ, రైతులకు కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా చర్చలు, అభిప్రాయాలు పంచుకోవడం జరుగుతుందని తెలిపారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను సాధించేందుకు పార్టీ కట్టుబడి ఉందని, రైతుల ప్రయోజనాల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
రేపు మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ సదస్సు
వెల్లడించిన నిసార్ అహ్మద్


