గాలివీడు: మండలంలోని గరుగుపల్లె పంచాయతీ పరిధిలోని ఇడపన్ చేనుపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంటలను అడవి జంతువుల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఒక యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది.గ్రామానికి చెందిన పందికుంట సాయికుమార్ రెడ్డి (19) తన సొంత పొలంలోని వేరుశనగ పంట వద్ద విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మతి చెందాడు. గ్రామస్తులు కథనం మేరకు ప్రతిరోజూ పంట కాపలాకు తండ్రి ఇరగం రెడ్డి లేదా తల్లి ఆకులమ్మ వెళ్లేవారు.ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి సంఘటన జరిగిన రోజు సాయికుమార్ రెడ్డి తన తండ్రికి భోజనం తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను గమనించలేదు.ముందుకెళుతుండగా విద్యుత్ తీగలు తాకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న తండ్రి ఇరగం రెడ్డి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సాయికుమార్ రెడ్డి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఇరగం రెడ్డికి ముగ్గురు సంతానం. సాయికుమార్‌రెడ్డి రెండవ కుమారుడు.ఇతను గాలివీడులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసినట్లు తెలిసింది.


