పెద్దమండ్యం: ఆకారణంగా తనను నైట్ వాచ్‌మెన్ విధుల నుంచి తొలగించారని మహిళా వాచ్‌మెన్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రిన్సిపల్, ఎంఈవో–2 ల వేధింపులే కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కలిచెర్లకు చెందిన విశ్వనాథ భార్య వైజయంతి సిద్దవరం కేజీబీవీలో నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆంగళ్లుకు సమీపంలోని చేనేతనగర్‌లో నివాసం ఉంటూ రోజువారీగా విధులకు వచ్చి వెళతోంది. ఈ క్రమంలో కేజీబీవీలో విద్యార్థినులతో పనులు చేయిస్తున్నారని ఇటీవల సోషల్ మీడియాలో ఫొటోలు హల్‌చల్ చేశాయి. పత్రికల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి. దీంతో సంబంధిత అధికారులు అప్పట్లో విచారణ నిర్వహించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలు ఎప్పుడో తీసినవని అధికారులు నివేదించినట్లు సమాచారం. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే అప్పటి నుంచి కేజీబీవీలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నైట్‌వాచ్‌మెన్‌కు ఒకటిన్నర సంవత్సర కాలంగా జీతం చెల్లించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్‌కు, నైట్‌వాచ్‌మెన్‌కు మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. విధుల నిర్వహణ విషయంలో తన భార్యకు ఇచ్చే నోటీసులపై వివరణ ఇచ్చినా ఉన్నతాధికారులకు పంపకుండా ప్రిన్సిపల్, పాఠశాల తనిఖీ కోసమని వచ్చే ఎంఈవో 2, వేధింపులకు గురి చేసి, నిందలు మోపి ఉన్నతాధికారులకు నివేదించారని భర్త ఆరోపిస్తున్నాడు. విధుల నుంచి తొలగించారని వాట్సప్ ద్వారా సమాచారం అందడంతో చేనేతనగర్‌లో నివాసం ఉన్న ఇంటిలో విషద్రావణం తాగింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. నైట్‌వాచ్‌మెన్ సంఘటనపై ప్రిన్సిపల్ రాణికుమారిని వివరణ కోరగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంతో ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి నైట్‌వాచ్‌మెన్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఈ విషయమై తనకు ఎటువంటి సంబంధం లేదని ఎంఈవో–2 జి రామకృష్ణ తెలిపారు.
ప్రిన్సిపల్, ఎంఈవో–2 వేధింపులే
కారణమని ఆరోపణ


