బంతి.. బంతికీ బెట్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

బంతి.. బంతికీ బెట్టింగ్‌

Mar 29 2026 7:09 AM | Updated on Mar 29 2026 7:09 AM

బెట్టింగ్‌లకు పాల్పడితే కఠినచర్యలు

రాయచోటి/రాయచోటి జగదాంబసెంటర్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ – 2026 (ఐపీఎల్‌) 19వ సీజన్‌ శనివారం నుంచి ప్రారంభమైంది. ఉత్కంఠగా సాగే ఈ క్రికెట్‌ మ్యాచ్‌లను అభిమానులు ఆసక్తిగా చూస్తారు. అభిమానుల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడానికి బుకీలు రంగంలోకి దిగనున్నారు. శ్రీమీ ఫేవరెట్‌ టీమ్‌ గెలుస్తుందా.. నిజంగా టీమ్‌పై అభిమానం ఉంటే బెట్టింగ్‌ కట్టవచ్చు కదా.. సరదాకు సరదా.. డబ్బులూ గెలుచుకోవచ్చూ.. అంటూ ముగ్గులోకి దించుతున్నారు. బెంగళూరు కేంద్రంగా రాయచోటి నియోజకవర్గంతో పాటు మండలాల కేంద్రాలకు.. గ్రామాలకు బెట్టింగ్‌ వ్యవహారం విస్తరిస్తోంది. ఇదేమీ గుట్టుగా కాదు ఆన్‌లైన్‌ద్వారా బహిరంగంగానే సాగిస్తున్నారు. బెట్టింగ్‌ అంతా సెల్‌ఫోన్లోనే సాగుతోంది. ఇరువురు ఫోన్లలోనే కాంటాక్టు చేసి బెట్టింగులు కాయిస్తున్నారు. గెలిచిన వారి నుంచి కమీషన్‌ పొందేలా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. పట్టణాలు, పల్లెల్లోని యువకులను టార్గెట్‌ చేస్తున్నారు. జిల్లాలో ఎంతో మంది యువకులు బెట్టింగ్‌లో ఓడి అప్పుల పాలవడం, కొందరు అప్పుల్లోకి కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకున్న సంఘటనలు గతంలో జరిగాయి.

టాస్‌ వేసే సమయం నుంచి బ్యాటింగ్‌ ఎవరు ఎంచుకొంటారు.. బౌలింగ్‌ ఎవరు చేస్తారు.. ఏ క్రికెటర్‌ ఎన్ని పరుగులు తీస్తాడు.. ఓవర్‌కు ఎన్ని పరుగులు వస్తాయి.. ఎవరు గెలుస్తారు.. ఎన్ని పరుగులతో మ్యాచ్‌ పూర్తి కానుంది.. ఇలా ప్రతి దానికీ ఒక పందెం ఉంటుంది.

ప్రత్యేక యాప్‌ల ద్వారా: అండ్రాయిడ్‌ సెల్‌ఫోన్లో క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడేవారు కొన్ని యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పందేలు కాయడం.. మ్యాచ్‌ చూసేందుకు ఒకటి.. బెట్టింగ్‌ కాసేందుకు మరో మొబైల్‌ వినియోగించి ఆన్‌లైన్లో క్రికెట్‌ బుకీలు సంప్రదింపులు జరుపుతూ కమీషన్‌ పొందనున్నారు.

పెద్ద పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ యువత పోగై తమకు అనువైన ప్రదేశాలను ఎంచుకొని బెట్టింగ్‌లకు దిగుతున్నారు. గతంలో ఎవరెవరు బెట్టింగ్‌లకు పాల్పడింది గుర్తిస్తే బెట్టింగ్‌లపై పోలీసుల నిఘా పెట్టి తగ్గించవచ్చు. బెట్టింగ్‌ వ్యవహారం అంతా కోడ్‌ లాంగ్వేజీలోనే సాగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. సెల్‌ఫోన్లోనే ఎస్‌.. నో.. ఓకే.. డన్‌.. ఈటింగ్‌ వంటి పదాలు దీనికోసం వాడనున్నారు. గ్రౌండ్‌లో చూసే ఆటకు.. టీవీల్లో చూసే వారికి రెండు నుంచి మూడు బంతుల సమయం తేడా ఉంటుంది. ఆట ముందే తెలుసుకొని బెట్టింగులు కాసే వారి జేబులను బుకీలు గుల్ల చేస్తుంటారు. ఇది యువత గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రారంభమైన ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు

అభిమానుల ఆసక్తిపై బుకీల వల

బెట్టింగ్‌లోకి దింపి.. గుల్ల చేస్తున్న వైనం

క్రికెట్‌ బెట్టింగ్‌ల పేరుతో యువతను ఊబిలోకి దింపి ఆన్‌లైన్లో, ప్రత్యేక యాప్‌ల ద్వారా నేరుగా ఆడించి కమీషన్లు పొందే వారిపై కఠినచర్యలు తప్పవు. యువత కూడా క్రికెట్‌ మోజులో పెడదారి పట్టకుండా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి. పోలీసులు అధునాతన టెక్నాలజీతో పర్యవేక్షిస్తున్నారు. బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. – కృష్ణమోహన్‌, డీఎస్పీ, రాయచోటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement