భర్తతో కాపురం చేయనివ్వడం లేదు | - | Sakshi
Sakshi News home page

భర్తతో కాపురం చేయనివ్వడం లేదు

Mar 29 2026 7:09 AM | Updated on Mar 29 2026 7:09 AM

మైదుకూరు : అత్తామామలు, ఆడపడుచులు తనను భర్తతో కాపురం చేయనివ్వడం లేదని ఆరోపిస్తూ ఓ యువతి అత్తింటి వద్ద బైఠాయించిన సంఘటన శనివారం మైదుకూరు పట్టణంలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన తప్పెట సునీత అనే బాధిత యువతి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సునీతకు మైదుకూరుకు చెందిన గోపవరం నవీన్‌ కుమార్‌తో రెండున్నరేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లికి ముందే యువతి హైదరాబాద్‌లో, నవీన్‌ కుమార్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేసేవారు. వివాహం తర్వాత ఇద్దరం కలిసి కాపురం పెడదామని సునీత కోరినా కొన్నాళ్లు ఆగాలని భర్త చెప్పాడు. రెండున్నరేళ్లు గడిచినా పట్టించుకోకపోవడంతో పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించింది. కొద్ది రోజుల్లోనే ఇద్దరితో కాపురం పెట్టిస్తామని పెద్ద మనుషులు చెప్పడంతో సునీత హైదరాబాద్‌ వెళ్లిపోయింది. తర్వాత తనకు తన భార్య సునీతతో ప్రాణహాని ఉందని నవీన్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు తీసుకునేందుకు సమ్మతి తెలిపిందని పత్రాలు సృష్టించి విడాకులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి రెండు మూడు రోజులుగా సునీత అత్తింటి వద్దకు రాగా అత్తా మామలు ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో శనివారం సాయంత్రం అత్తింటి వద్ద బైఠాయించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనది పెద్దలు కుదిర్చిన వివాహమని, తల్లిదండ్రులు వివాహ సమయంలో 16 తులాలు బంగారు ఆభరణాలు పెట్టారని, రూ.7లక్షలు ఖర్చు చేసి పుట్టింటి వారే వివాహం జరిపించారని తెలిపింది. పెళ్లి తర్వాత కాపురం పెట్టాలని కోరగా తన భర్త వాయిదా వేస్తూ వచ్చాడని పేర్కొంది. తాను పండుగ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి వస్తే అత్త, ఆడపడుచులు ఇంట్లోకి రానివ్వరని ఆరోపించింది. అదనపు కట్నంగా స్థలాలు, ఇల్లు రాయించుకుని రావాలని అత్త లక్ష్మీదేవి తనను వేధిస్తోందని తెలిపింది. వేధింపులు తాళలేక మైదుకూరు పోలీసులను ఆశ్రయించగా ప్రొద్దుటూరులో ఫిర్యాదు చేయాలని చెప్పారని, ప్రొద్దుటూరు టూటౌన్‌ పోలీసుల వద్దకు వెళితే మైదుకూరులో ఫిర్యాదు చేయమన్నారని వాపోయింది. దిక్కు తోచక వారం కిందట ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అయినా ఇంత వరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని అన్నారు. తాను ఇంటి వద్దకు రాగానే అత్తా మామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని చెప్పింది. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి సునీత కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement