మలుపు.. ప్రమాదాలకు పిలుపు | - | Sakshi
Sakshi News home page

మలుపు.. ప్రమాదాలకు పిలుపు

Mar 28 2026 7:35 AM | Updated on Mar 28 2026 7:35 AM

అమ్మో ప్రొద్దుటూరు మలుపు

బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడది కేంద్రం, పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. అందులో ప్రధానంగా ప్రొద్దుటూరు మలుపుగా పిలిచే మూడో మలుపు అతి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఎప్పుడు ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఎవరు ఆస్పత్రి పాలవుతారో తెలియక ఆందోళన గురవుతున్నారు. గతవారం వరుసగా మూడు ప్రమాదాలు జరగడం పర్యాటకల్లో భయాందోళనలు కలిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు హార్సిలీకొండపై సేద తీరేందుకు వస్తుంటారు. వీరిలో అత్యధికలు కర్ణాటక, తమిళనాడు,అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన పర్యాటకులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ప్రమాదాలతో ఘాట్‌ రోడ్డు ప్రయాణం ఆందోళనకరంగా మారింది.

తొమ్మిది కిలోమీటర్ల ఘాట్‌

హార్సిలీకొండపైకి వెళ్లాలంటే తొమ్మిది కిలోమీటర్లు ఘాట్‌ రోడ్డుపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాండ్లమడుగు నుంచి మొదలయ్యే ఘాట్‌ కొండపై వరకు ప్రమాదకరమైన మలుపులతో, వంపులతో, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించినంత మలుపులు ఉంటాయి. మలుపుల వద్ద అతి జాగ్రత్తగా వాహనాలు నడపకపోతే ప్రమాదం తప్పదు. దీనికి తోడు అతివేగం అనర్ధం చేస్తుంది.

నిత్యం ప్రమాదాలే

హార్సిలీహిల్స్‌పై ప్రమాదాలు ఒకటి రెండు కాదు నిత్యం జరుగుతున్నాయి. కార్లు బోల్తా పడటం, గంగోత్రి దాటాక మలుపు వద్ద నీలగిరి వృక్షానికి బైక్‌, కార్లు ఢీకొనడం, కొండపైన నిలిపిన వాహనాలు కిందకు పడిపోవడం, వ్యూపాయింట్ల వద్ద సందర్శకులు ప్రమాదాలకు గురి కావడం, ఇలా లెక్కలేనన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇవి కాక కొండ పూర్తిగా దిగాక అతివేగాలకు ఆటో, రవాణా వాహనాల ప్రమాదాలతో చాలామంది మృత్యువాత పడ్డారు.

చర్యులు శూన్యం

హార్సిలీహిల్స్‌పై జరుగుతున్న వరుస ప్రమాదాలను, భవిష్యత్తు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఒక్కటి లేవు. ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేవు, కనీసం సూచికలు కూడా లేవు. పర్యాటకులను అప్రమత్తం చేసే చర్యలు లేవు. బయట ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులకు ఘాట్‌ రోడ్డుపై అవగాహన ఉండదు. అతివేగంగానో, నిర్లక్ష్యంగానో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూచికలు, వేగ నియంత్రణ పద్ధతులను పాటించకపోతే ఈ ప్రమాదాలకు అంతే ఉండదు.

మద్యం ప్రభావం కూడా...

హార్సిలీహిల్స్‌కు వచ్చే పర్యాటకులు మద్యం తాగడానికి ఇష్టపడతారు. వెంట మద్యం తీసుకొచ్చి విందులు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీని వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం తాగి బైక్‌, కార్లు, రవాణా వాహనాలు నడిపే వారిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. కొండ దిగేటప్పుడు వీరు మద్యం తాగారా లేదా అన్న పరీక్షలు నిర్వహించడం మొదలుపెడితే చాలా ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం ఈ విషయంలో ప్రణాళిక రూపొందించి పర్యాటకులకు ఏ ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

హర్సిలీహిల్స్‌పై నిత్య ప్రమాదాలతో పర్యాటకుల్లో ఆందోళన

ట్రాఫిక్‌ సూచనలు లేవు, వేగ నియంత్రణపై చర్యలు లేవు

మద్యం మత్తులో వాహనాలు నడపడంపై తనిఖీలు శూన్యం

కొండ కింద నుంచి పైకి వెళ్లేటప్పుడు మూడో మలుపును ప్రొద్దుటూరు మలుపుగా పిలుస్తారు. దీనికి కారణం ఏమంటే 40 ఏళ్ల క్రితం హార్సిలీ హిల్స్‌ సందర్శనకు వచ్చిన పెళ్లి బందం బస్సు కొండపై పర్యటించి తిరుగు ప్రయాణంలో ఈ మలుపు కుడివైపున కు తిరగకుండా నేరుగా లోయలోకి దూసుకెళ్లిపడిపోయింది. ఈ ఘటనలో పెళ్లి వారంతా చనిపోయారని స్థానికులు చెబుతుంటారు. అప్పటినుంచి దీనికి ప్రొద్దుటూరు మలుపుగా పేరు నిలిచిపోయింది. ఈ ప్రమాదంతోనే ఇక్కడ ఘటనలు ఆగిపోలేదు. నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. బైక్‌ నుంచి కార్లు, రవాణా వాహనాలు ఒకటి కాదు ప్రతిదీ మలుపు వద్ద కిందికి దిగేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది చాలా ఇరుకై న మలుపు. దిగేటప్పుడు వేగం పూర్తిగా తగ్గించి ఎదురుగా రోడ్డు ఎలా ఉందో గమనించి వాహనాలు నడిపితే తప్ప ప్రమాదాల నుంచి బయటపడలేరు. దీంతో ఈ మలుపు వద్ద బలమైన గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ గ్రిల్స్‌ కూడా ప్రమాదాల ధాటికి దెబ్బతిన్నాయి. ప్రమాదాలు నివారించాలని చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. లోయలోకి పడకుండా చేశారే తప్ప ప్రమాదం జరగకుండా నివారించలేకపోతున్నారు. దెబ్బతిన్న గ్రిల్స్‌, పిట్టగోడ మధ్యలో పెద్ద బండరాళ్లు వేసి ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement