పెద్దశేష వాహనంపై రఘురాముడు | - | Sakshi
Sakshi News home page

పెద్దశేష వాహనంపై రఘురాముడు

Mar 28 2026 7:35 AM | Updated on Mar 28 2026 7:35 AM

సర్వభూపాలుడిపై శ్రీరామచంద్రడు

వైభవంగా పట్టాభిరామస్వామి

బ్రహ్మోత్సవాలు

పెద్దశేష వాహనంపై శ్రీరాముల వారి ఊరేగింపు

సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తున్న శ్రీరామచంద్రుడు

వాల్మీకిపురం : వాల్మీకి క్షేత్రంలోని శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వామి వారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన అనంతరం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. వాహన సేవ అనంతరం 10 గంటల నుంచి స్నపన తిరుమంజనం వేడకగా నిర్వహించారు. సాయంత్రం ఊంజల మండపంలో శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహనసేవ కోలాహాలంగా సాగింది. స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మహిళలు పెద్దశేష వాహనంపై ఊరేగుతున్న స్వామివారికి నేతి దీపాలతో తిరుమాడ వీధుల్లో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్‌, అర్చకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు చింతల ఆనందరెడ్డి, నీళ్లభాస్కర్‌, రఘు, సత్య, శ్రీనివాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నేడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, 10 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల సేవ, సాయంత్రం 6:30 గంటలకు చంద్రప్రభ వాహనసేవ, 8:30 గంటలకు పల్లకీలో మోహినీ అవతారోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

నమో నాగాంజనేయం

నాగ ఆంజనేయస్వామి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. శ్రీ రామనవమి పురస్కరించుకుని మదనపల్లె పట్టణం బీటీ కాలేజీ మైదానం వద్దనున్న వరాల ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి వారు నాగ ఆంజనేయస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి తలపై నాగదేవతలు, స్వామి తోకకు ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. – మదనపల్లె సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement