మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నిమ్మనపల్లి మండలం బండ్లపై గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు ఆనంద్(27) కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితున్ని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
తండ్రిపై తనయుడి దాడి
మదనపల్లె టౌన్ : మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రిపై తనయుడు కరత్రో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన శుక్రవారం కురబల కోట మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని ఎగువ చెన్నామర్రికి చెందిన రైతు వెంకటరమణ(58) కుమారుడు నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. నాగరాజు ప్రతి రోజు మద్యం తాగి ఇంటికొచ్చి అనుచితంగా ప్రవర్తించేవాడు. శ్రీరామ నవమి పండుగ రోజు కూడా ఇంట్లో మనశ్శాంతి లేకుండా తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. తన వద్ద డబ్బులేదని చెప్పడంతో ఆగ్రహించిన నాగరాజు తండ్రి అని కూడా చూడకుండా కరత్రో దాడి చేసి తీవ్రంగా గాయ పర్చాడు. బాధితున్ని కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
గుండెపోటుతో వ్యక్తి మృతి
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కల్యాణ వేదిక వద్ద పనులు చేస్తుండగా అంజి(44) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కల్యాణ వేదిక వద్ద పనులు చేస్తున్న అంజి అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో 108 సహాయంతో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9121100582, 9121100581 అనే ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.


