కల్పవృక్ష వాహనంపై వీరప్రతాపరాముడు.
సింహవాహనంపై ఊరేగుతున్న పట్టాభిరాముడు.
వాల్మీకిపురం: వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరాములవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు గురువారం ఉదయం స్వావివారు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన అనంతరం ఉదయం 8గంటలకు స్వామివారిని కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరించారు. భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 10గంటలకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజన సేవ, సాయంత్రం ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి 8గంటలకు ఉత్సవర్లను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి సింహవాహనంపై కొలువుదీర్చారు. తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీక్రిష్ణదేవరాయ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేరళ, కర్ణాటక, తమిళనాడు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8గంటలకు సర్వభూపాల వాహనం, 10గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6గంటలకు ఊంజల సేవ, రాత్రి 8గంటలకు పెద్దశేష వాహన సేవ నిర్వహించనున్నారు.


