● ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు
మంజూరు చేయాలి
● బి.కొత్తకోట, మదనపల్లెల్లో సీపీఐ ధర్నాలు
మదనపల్లెలో ఆందోళన చేస్తున్న సీపీఐ శ్రేణులు
బి.కొత్తకోటలో ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు
బి.కొత్తకోట : ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని కూటమి పాలకులను సాగనంపుతామని సీపీఐ నేతలు హెచ్చరించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు, మహిళలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పక్కా గృహాలు మంజూరు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రామానాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బి.కొత్తకోట పట్టణ పేదలు వెయ్యి మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసినా స్వాధీనం చేయలేదన్నారు. దీని కారణంగా ఇప్పుడు కొత్తగా లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదన్నారు. గతంలో ఇచ్చిన పట్టాలు రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, పింఛన్లు, రేషన్ కార్డులు, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీలకు పింఛన్లు, అర్హులైన వ్యవసాయ కూలీలందరికీ కుటుంబానికి మూడు ఎకరాల సాగుభూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ బావాజాన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి ఎస్.మనోహర్‌రెడ్డి, నాయకులు సింగన్న, హరికుమార్, ఫయాజ్, ఎం.అష్రఫ్‌అల్లీ, ఎస్.బషీర్ ఖాన్, పి.నారాయణస్వామి, యస్.తంబయ్యశెట్టి, ఎం.గంగులప్ప, జవహార్ బాబు, జి.శంకర, వి.సుధాకర్, దుమ్ము, బాబు, రియాజ్, బావాజాన్ తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లెలో..
మదనపల్లె : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు స్వాధీనం, భూమిలేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేసి, బాడుగ ఇంట్లో ఉండే పేదవారికి అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు. గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 31 లక్షల మంది పేదలకు ఇంటి స్థలం ఇస్తే.. ఒకటిన్నర సెంటు సరిపోదు, పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎన్నికలయ్యాక విస్మరించారన్నారు. టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు కట్టి వీధుల్లో ఉన్న బాధితులను ఆదుకోవాలన్నారు. ఏడు లక్షల మంది పింఛన్లు తీసేసిన ప్రభుత్వం పేదరిక నిర్మూలన చేయడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, జనార్ధన్, సాంబశివ, నియోజవర్గ కార్యదర్శి మురళి, పట్టణ కార్యదర్శి మాధవ్, దేవా తిరుమల, తరుణ్, ఇంద్రాణి, కాంతమ్మ, రాధా తదితరులు పాల్గొన్నారు.


