మదనపల్లె టౌన్: పెళ్లి జరిగిన ఏడాదికే తనను భర్త వేధిస్తున్నాడని మంగళవారం ఓ బాధితురాలు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన నాగరాజన్, రాధమ్మ దంపతుల కుమార్తె పల్లవిని అదే ప్రాంతానికి చెందిన చౌడౌడేశ్వరి నగర్‌లో ఉండే నవీన్‌కు ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన నాలుగు నెలల పాటు బాగానే ఉన్నట్లు పల్లవి తెలిపారు. ఇంతలో ఏం జరిగిందో తన భర్త రోజూ తాగొచ్చి గొడవపడి వేధిస్తుండడంతో బాధ భరించలేక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పుట్టినింటికి తీసుకు వచ్చారని చెప్పారు. తనను కాపురానికి తీసుకు పోకుండా రోజూ వేధిస్తుండటంతో విధి లేక పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.
యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం అర్థరాత్రి ములకలచెరువులో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక హైస్కూల్ వీధిలో కాపురం ఉంటున్న బావాజాన్ (30) భార్యతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది బైకుకు ఉన్న పెట్రోల్ తీసి, ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మంటల్లో కాలుతున్న బావాజాన్‌ను కుటుంబీకులు గమనించి కాపాడి వెంటనే 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు మెరుగైన వైద్య చికిత్సలు అందించి అతన్ని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై ములకలచెరువు ఎస్‌ఐ ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన యువకుడి మృతి
కలికిరి : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమా దంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అల్తాఫ్ (20) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసు లు తెలిపారు. కలికిరి–సోమల రోడ్డు సామగుంటవారిపల్లి బస్టాప్ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు సోమవారం రాత్రి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనంలో పెట్రోలు క్యానుతో వెళుతున్న అల్తాఫ్ క్యాను పగిలి మంటలు వ్యాపించి అంటుకుని గాయాల పాలయ్యాడు. చికిత్స నిమిత్తం అతన్ని కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మంగళవారం ఉదయం మృతి చెందినట్లు, రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గుర్రంకొండ : గుర్రంకొండ రైతు సేవా కేంద్రంలో వీహెచ్‌ఏగా పని చేస్తున్న అక్రమ్‌బాషా ప్రవర్తనా తీరుపై జిల్లా వ్యవసాయ అధికారులు విచారణ జరిపారు. ఇటీవల అక్రమ్‌బాషా తీరుపై మర్రిమాకులపల్లెకు చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ భయ్యారెడ్డితోపాటు పలువురు రైతులు కలెక్టర్‌కు, జిల్లా వ్యవసాయాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా వ్యవసాయ కార్యాలయ ఏడీఏ మజీద్ అహమ్మద్ ఆధ్వర్యంలో స్థానిక రైతు సేవా కేంద్రంలో విచారణ నిర్వహించారు. ఫిర్యాదు చేసిన రైతుల అభియోగాలపై మొదట విచారణ జరిపారు. అక్రమ్‌బాషా రైతుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని, ఏదైనా సమాచారం అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడని, యూరియా పంపిణీపై సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ రైతులు విచారణాధికారికి ఫిర్యాదు చేశారు. ఇకపై తన తీరు మార్చుకొంటానని రైతులతో దురుసుగా వ్యహరించబోనని అక్రమ్‌బాషా పేర్కొన్నారు. విచారణ నివేదికను జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఏడీఏ మజీద్ అహమ్మద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రత్నమ్మ, రైతులు పాల్గొన్నారు.


