● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
● కోర్టు మానిటరింగ్ సిబ్బంది,
కానిస్టేబుళ్లకు శిక్షణ
మదనపల్లె టౌన్ : సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. మంగళవారం మదనపల్లి ఎస్పీ కార్యాలయంలో టీసీఆర్బీ ఆధ్వర్యంలో కోర్టు మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కోర్టు కానిస్టేబుళ్లు బాధితులకు, కోర్టుకు వారధిలా పని చేయాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేసే కోర్టు కానిస్టేబుళ్లు ప్రతి కేసుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. హత్యలు, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలు (పోక్సో), మత్తు పదార్థాల రవాణా కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడేలా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. నిందితుడికి శిక్ష పడినప్పుడే బాధితుడికి నిజమైన న్యాయం జరిగినట్లని అన్నారు. సాక్షులు భయ పడకుండా వాంగ్మూలం ఇచ్చేలా వారికి రక్షణ కల్పించి కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. న్యాయస్థానాలు జారీ చేసే సమన్లు, బెయిలబుల్, నాన్–బెయిలబుల్ వారెంట్ల అమలులో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. పెండింగ్ వారెంట్లను పరిష్కరించి నివేదించాలన్నారు. బీఎన్‌ఎస్‌ఎస్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, కొత్త నిబంధనల ప్రకారం కోర్టు ప్రొసీడింగ్స్ జరిగాలన్నారు. కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ వినియోగంపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కోర్టు కానిస్టేబుళ్లు తమ పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, కేసుల పురోగతిని పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. విధుల పట్ల నిబద్ధతతో పని చేసే సిబ్బందికి తగిన గుర్తింపు ఉంటుందని, విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఏ.ఆదినారాయణరెడ్డి, సీఎంఎస్ ఇన్‌స్పెక్టర్ కె.దస్తగిరి, చంద్రశేఖర్, పలువురు ఎస్‌ఐలు, కోర్టు లైజనింగ్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


