అవకాశం వినియోగించుకోవాలి
సమిష్టి కృషితో మంచి ఫలితాలు
● అత్యుత్తుమ విద్యాబోధన
● కేజీబీవీల్లోఅడ్మిషన్ల సందడి
● ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు అవకాశం
● 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, వసతి
● బాలికల రక్షణే లక్ష్యం
● అంతా మహిళా సిబ్బందే
మదనపల్లె సిటీ: పేద, అనాధ మరియు బడి బయట ఉన్న బాలికలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబుద్దులు నేర్పుతున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాణిస్తున్నాయి. జిల్లాలోని 17 కేజీబీవీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల విద్యార్థినులు ఏప్రిల్ 1వతేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో బి.కొత్తకోట, చిన్నమండ్యం, గాలివీడు, కలకడ, కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, ములకలచెరువు, పెద్దమండ్యం, పెద్దతిప్పసముద్రం, పుంగనూరు, రామాపురం, రామసముద్రం, రాయచోటి, సంబేపల్లి, తంబళ్లపల్లె, వగళ్లలలోని కేజీబీవీలలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు డబ్యూ.డబ్యూ.డబ్యూ. ఏపీకెజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సీట్ల భర్తీ నిబంధనల మేరకు ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ కేటగిరీ వారిగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సీట్లను భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా 6వ తరగతిలో మొత్తం సీట్లు భర్తీ చేస్తారు. 7 నుంచి ఇంటర్ సెకండియల్ వరకు ఖాళీల మేరకు అడ్మిషన్లు ఉంటాయి.
విద్యావిధానం–గ్రూపులు
ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఒక్కో కేజీబీవీలో ఒక్కో గ్రూపును ప్రవేశపెట్టారు. 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు ఉంటాయి. ఎంపీసీ,బైపీసీ,ఎంఈసీ,సీఈసీ,ఎంపీహెచ్‌డబ్యూ. ఎంఎల్‌టీ, అకౌంట్స్ గ్రూపులున్నాయి. పదో తరగతి పూర్తి చేసిన వారు ఉనోనత చదువులకు వెళ్లేలా ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నారు.
కేజీబీవీల ప్రత్యేకతలు:
ఆటలు,కరాటేలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో శిక్షణ ఇస్తారు. ఆరోగ్యం, నైతిక విలువలు పెంపొందించేలా వ్యక్తిత్వ వికాసం తరగతులను నిర్వహిస్తారు. ప్రతి కేజీబీవీలో విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులను పరీక్షించడానికి ఒక ఎఎన్‌ఎంలు ఉంటారు. కంప్యూటర్, వ్యాయామం, ఆరోగ్యం, వృత్తి నైపుణ్య విద్యను అమలు చేస్తున్నారు.
తంబళ్లపల్లెలోని కస్తూర్బాగాందీ విద్యాలయం
ప్రత్యేక తరగతుల్లో కేజీబీవీ విద్యార్థులు
జిల్లాలోని కేజీబీవీల సంఖ్య : 17
6వ తరగతిలో ఖాళీలు : 680
7వ తరగతిలో ఖాళీలు : 81
8వ తరగతిలో ఖాళీలు : 19
9వ తరగతిలో ఖాళీలు : 25
10వ తరగతిలో ఖాళీలు : 27
ఇంటర్మీడియట్ మొదటి
సంవత్సరం ఖాళీలు : 680
ఇంటర్మీడియట్ ద్వితీయ
సంవత్సరం ఖాళీలు : 216
జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. విద్యార్థినులు ఈ అవకాశం వినియోగించుకోవాలి. ఏప్రిల్ 1వతేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. పేద, అనాధ, బడిబయట పిల్లలు,బడి మానేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవాలి.
– డాక్టర్ ఎన్.అనూరాధ, సమగ్రశిక్ష అడిషనల్‌ప్రాజెక్టు కోఆర్డినేటర్.
కేజీబీవీ పాఠశాలల్లోని ఉద్యోగుల సమిష్టి కృషితోనే మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయి. విద్యార్థుల ప్రతిభను మెరుగులు దిద్దేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నారు. జిల్లా స్థాయిలో రూపొందించిన ప్రణాళిను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో ఏటా పదో తరగతి ఫలితాలు మెరుగ్గా వస్తున్నాయి. – డాక్టర్ సుబ్రమణ్యం, డీఈఓ,


