● కొండెక్కుతున్న కోడి ధరలు
● ఎండల దెబ్బకు కోళ్ల కొరత
● అప్పుల్లో కూరుకుపోతున్న రైతన్న
మదనపల్లె అర్బన్ : మదనపల్లె ప్రాంతంలో మాంసం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే చికెన్, ఇప్పుడు ధరల విషయంలో నాటుకోడితో పోటీ పడుతోంది. ఎండల తీవ్రత వల్ల మార్కెట్లో కోళ్ల కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి.
ధరల పెరుగుదల – గణాంకాలు
గత జనవరిలో కిలో రూ. 170 నుంచి రూ. 200 మధ్య ఉన్న చికెన్ ధర, ప్రస్తుతం రూ. 250 నుంచి రూ. 270 కి చేరింది. నాణ్యమైన పెద్ద బ్రాయిలర్ కోళ్ల ధర అయితే ఏకంగా రూ. 330 నుంచి రూ. 360 పలుకుతోంది. నాటుకోడి కిలో ధర రూ.600 పలుకుతుండగా, మటన్ ధర కిలో రూ. 900 కి చేరడంతో, ప్రజలు చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఎందుకీ పరిస్థితి?
ఎండల సెగ : ఇటీవల సోకిన బర్డ్ ఫ్లూ వ్యాధి, తీవ్రమైన ఎండల వల్ల కోళ్లు భారీగా మృత్యువాత పడ్డాయి.
నష్టాల్లో రైతు : లక్షలు ఖర్చు చేసి ఫారాలు ఏర్పాటు చేసినా, కోళ్ల మరణాలతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిండికేట్ సెగ : కోళ్ల కంపెనీలు, ట్రేడర్స్ సిండికేట్‌గా మారి ధరలను నియంత్రిస్తుండటం వల్ల అటువినియోగదారులకు, ఇటు రైతులకు అన్యాయం జరుగుతోంది.
భవిష్యత్తు ఏంటి
జాతరల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జూన్, జూలై నాటికి మటన్ ధర రూ. 1000 మార్కును తాకే అవకాశం ఉందని, ఈ క్రమంలో చికెన్ ధరలు కూడా ఆగస్టు (వినాయక చవితి) వరకు తగ్గే సూచనలు లేవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


