ప్రజా సమస్యలను పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలను పరిష్కరించండి

Mar 24 2026 7:52 AM | Updated on Mar 24 2026 7:52 AM

మదనపల్లెఅర్బన్‌ : పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ఆదేశించారు. మదనపల్లె లోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కా ర వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీల పరిష్కారంపై ఆయాశాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అర్జీదారులతో నేరుగా మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. దీంతోపాటు సమస్యల పరిష్కారంలో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కాగా, సోమవారం ప్రజల నుంచి మొత్తం 332 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శివనారాయణ్‌ శర్మ, సబ్‌కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్జీల వివరాలు కొన్ని..

● మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ పాళెంకొండకు చెందిన కె.కృష్ణమూర్తి సమస్యను విన్నవిస్తూ తన భార్య పద్మావతమ్మ మూడేళ్ల కిందట పిడుగుపడి మరణించిందని చెప్పాడు. అయితే ఆమె పేరుమీద ఉన్న ఇల్లు తనపేరిట మార్చుకునేందుకు నానాకష్టాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. నెలల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదన్నాడు. పైగా లంచం డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపించాడు.

● కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లె పంచాయతీ ఎర్రజేనుపల్లెకు చెందిన ఎన్‌.బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్వేనంబర్‌–595లో ఉన్న 6.10 సెంట్ల వారసత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారన్నా డు. రీసర్వే చేసి తమ భూమిని తమకు అప్పగించాలంటూ అనేక సార్లు రెవెన్యూ అధికారులను కలసి విన్నవించినా వారు పట్టించుకోలేదన్నా డు. ముఖ్యంగా ఎక్కువ పొజిషన్‌లో ఉన్న వారు అక్రమార్కుల తో చేతులు కలిపి భూముల విక్రయానికి సిద్ధమయ్యారని ఆరోపించాడు. ఇదే జరిగితే తాము ఆర్థికంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశాడు.

● భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై)నాయకులు మాట్లాడుతూ బీసీల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కులగణన పూర్తి చేసి, బీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయాలన్నారు. అమరావతిలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించి, ఎన్నికల్లో 44శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. ఈ ఐదు డిమాండ్లను పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు.

● మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన లక్ష్మీసుకన్య, దేవేంద్ర దంపతులు మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్‌ రాజేశ్వరీ, ఈమె భర్త కృష్ణారెడ్డి, సోదరి ప్రభావతమ్మలు చీటీలు నిర్వహిస్తూ తమను మోసం చేశారన్నారు. ఐదు చీటీలకు రూ.10లక్షలు మాత్రమే ఇచ్చి, మిగతా రూ.80లక్షలు ముంచేశారని ఆరోపించారు. తాలూకా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను పట్టించుకోవడంలేదన్నారు. తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించి న్యాయం చేయాలంటూ బాధితులు కలెక్టర్‌కు విన్నవించారు.

ఇళ్ల పట్టాలపై విచారణకు ఆదేశం

రొంపిచెర్ల : రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని లక్ష్మీ నారాయణ కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలపై విచారణకు జిల్లా కలెక్టర్‌ సుమితకుమార్‌ సోమవారం అదేశాలు జారీ చేశారు. సర్వేనంబరు 1605–1, 1606–2 లో 172 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీలో స్థానిక ప్రజా ప్రతినిధులు చేతివాటం ప్రదర్శించి ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని రొంపిచెర్లకు చెందిన దొరబాబు నాయుడు జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో 172 ఇళ్ల పట్టాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ తహశీల్దార్‌ కిరణ్‌కుమార్‌ను అదేశించారు.

కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement