దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా | - | Sakshi
Sakshi News home page

దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా

Mar 22 2026 1:51 AM | Updated on Mar 22 2026 1:51 AM

రొంపిచెర్ల : ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చేతులెత్తేశారు. పైగా అనంతపురం– చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలం బండకిందపల్లె గ్రామ పంచాయతీలో ఆక్రమణకు గురైన భూమిని రక్షించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులదేనని తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ తెలియజేశారు. రూ.3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని కమోళ్లపల్లె, మట్లోళ్లపల్లె గ్రామస్తులు గత నెలలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారి పక్కన భూముల రేట్లు కోట్లలో పలుకుతుండడంతో కొందరు ఆక్రమణకు తెరలేపారు. రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో ఆక్రమణదారులు సర్వే నంబరు 36లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి చుట్టూ పెన్సింగ్‌ వేసి మామిడి మొక్కలు కూడా నాటేశారు. ఈ భూమిలో ఎవరు ప్రవేశించరాదని సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఈ భూమిని రక్షించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శిదేనని తహసీల్దార్‌ రైతులకు రాత పూర్వకంగా తెలియజేశారు. ఇది చూసిన రైతులు అవాక్కు అయ్యారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన తహసీల్దార్‌ ఈ వివాదంలో తప్పుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అదే భూమిలో చెరువు కాలువను కూడా పూడ్చి వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు కొందరు ఆక్రమణదారుడికి అనుకూలంగా మారిపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి సప్లయ్‌ చానల్‌ను పునరుద్ధణ చేసి ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

క్రిమినల్‌ కేసుల నమోదుకు ఆదేశం

బండకిందపల్లె గ్రామ పంచాయతీలో 36 సర్వే నంబరులో ముగ్గురు వ్యక్తులు 1.37 ఎకరాల భూమిని ఆక్రమించుకుని మామిడి చెట్లు కూడా నాటుకున్నారని గుర్తించాం. వీరిపైన క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రొంపిచెర్ల పోలీసులను ఆదేశించాం. గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులు, బండలు, కాలువల ఆక్రమణ జరిగితే, దానికి గ్రామ పంచాయతీ కార్యదర్శులే చర్యలు తీసుకోవాలి.

– కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌

36 సర్వే నంబరులో ముగ్గురు ఆక్రమణదారుల గుర్తింపు

ఆ స్థల రక్షణ బాధ్యత కార్యదర్శిదే

అంటున్న తహసీల్దార్‌

తహసీల్దార్‌ తీరుపై గ్రామస్తుల మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement