రాయచోటి : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రాయచోటి రింగ్ రోడ్డు పరిధిలోని గాలివీడు–వరిగ మార్గంమధ్యలో స్కార్పియో వాహనం బోల్తాపడి ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. సినిమా చిత్రీకరణను తలదన్నేలా స్కార్పియో వాహనం పల్టీలు కొట్టుకుంటూ రోడ్డుకు పడమటి వైపున ఉన్న రాళ్లకుప్పపై పడింది. వాహనం రాయచోటి పట్టణ టీడీపీ నాయకునికి చెందినది కావడం గమనార్హం. దీంతో గాయపడ్డ వారిని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించినట్లు తెలిసింది. సంఘటనపై ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలియవచ్చింది.
స్కూటర్‌ను ఢీకొన్న కారు
సంబేపల్లె : మండల పరిధిలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై బడ్డారెడ్డిగారిపల్లె సమీపంలో స్కూటర్‌ను కారు ఢీకొన్న సంఘటన చోటు చేసుకొంది. మండల పరిధిలోని అడవికమ్మపల్లె గ్రామం పాళెంగడ్డ దళితవాడకు చెందిన నాగబాబు సొంత పనులు చూసుకొని సొంత గ్రామానికి వెళ్తుండగా.. అరుణాచలం నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న కారు బుడ్డారెడ్డిగారిపల్లె సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని 108 సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆటో ఢీకొని..
మదనపల్లె అర్బన్ : ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్టకు చెందిన వెంకటరమణ(40), శ్రీనివాసులు(45) కూలీ పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం సొంత పనులపై ద్విచక్రవాహనంలో పట్టణంలోకి బయలుదేరారు. దారిలో గొల్లపల్లె బైపాస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.


