మదనపల్లె టౌన్ : భద్రాచలం కొల్లిగూడెం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతైన సంగతి పాఠకులకు తెలిసిందే. గోదావరిలో గల్లంతై మృతి చెందిన ఎస్‌ఆర్‌ఎమ్ విద్యార్థి సతీష్(21) స్వగ్రామం అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కొత్తవారిపల్లి పంచాయతీలోని కొయ్యలవారిపల్లిగా పోలీసులు గుర్తించారు. సతీష్.. నారాయణ కుమారుడు. శనివారం మృతదేహాన్ని గజఈతగాళ్ల సాయంతో వెలికితీశారు. విద్యార్థి సతీష్ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు గోదావరి వద్దకు చేరుకున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోయాడని వారు గుండెలవిసేలా విలపించడం చూపరులను తీవ్రంగా కలచివేసింది. ఇన్నాళ్లు సరదాగా తిరుగుతూ తమతో ఎంతో ఆప్యాయంగా పలకరించి మాట్లాడే సతీష్ ఇక లేడని తెలుసుకున్న కొయ్యలవాండ్లపల్లి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంజినీరింగ్ విద్యార్థి సతీష్ మృతితో కొయ్యలవారిపల్లెలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆలయంలో అమ్మవారి తాళిబొట్టు అపహరణ
వేంపల్లె : వేంపల్లెలోని పాపాఘ్ని నది సమీపంలో ఉన్న శ్రీదుర్గా గవి మల్లేశ్వరస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు గవిమల్లేశ్వర స్వామి ఆలయానికి ఉన్న తలుపులను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఆలయంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారి తాళిబొట్టుతోపాటు బీరువాలో ఉన్న మరికొన్ని వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు. రూ.3 వేల చిల్లర నాణేలు అపహరించారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. వారు ఆలయం వద్దకు వెళ్లి పరిశీలించారు. నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టపగలే ఇంటి తాళాలు పగలగొట్టి..
సుండుపల్లె : మండల పరిధిలోని రాయవరంలో శనివారం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాలలోకి వెళితే.. స్వర్ణలత అనే మహిళ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి గుర్తు తెలియని దుండగులు బీరువాలోని 6.6 తులాల బంగారు నగలు రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై బాధితురాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కొయ్యలవారిపల్లెలో అలుముకున్న విషాదం


