మదనపల్లె టౌన్ : అన్నదమ్ములపై కొందరు తాగుబోతులు విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బాధితులు టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మునెప్పకాలనీకి చెందిన నరసింహులు(29), ఆయన తమ్ముడు రెడ్డి నీలేశ్వర్(16) రాత్రి చౌడేశ్వరి అమ్మవారి జాతరలో నడుచుకుంటూ వెళ్తుండగా, ఆరోగ్యవరం యువకులు వారిని బైక్‌తో ఢీకొట్టారు. దీంతో నరసింహులు స్కూటరిస్టులను నిలదీశాడు. మదనపల్లె మండలం ఆరోగ్యవరానికి చెందిన మరి కొందరు యువకులను ఫోన్ చేసి పిలిపించి నరసింహులు, అతని తమ్ముడిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై భర్త ఎదుటే అసభ్య ప్రవర్తన
మదనపల్లె టౌన్ : స్థానిక చౌడేశ్వరి అమ్మవారి జాతరలో మహిళపై భర్త ఎదుటే ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఉండే మమత ఆమె భర్త సురేష్‌తో కలసి బైక్‌పై చౌడేశ్వరి అమ్మవారి జాతరకు వవెళ్లారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో అమ్మవారిని దర్శించుకుని వస్తుండగా.. కొంత మంది ఆకతాయి యువకులు మమత చుట్టూ తిరుగుతూ ఈలలు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. భర్త వారిని అడ్డుకున్నాడు. స్థానికంగా ఉన్న కొందరు గమనించి ఆకతాయిలను పట్టుకుని స్తంభానికి కట్టేశారు. జాతరలో ఉన్న బందోబస్తు పోలీసులు.. నాగరాజు నాయక్, రఘును అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలు మమత ఫిర్యాదుపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు.
ప్రార్థన చేసి వస్తుండగా రోడ్డు ప్రమాదం
మదనపల్లె టౌన్ : ఈద్గాలో ప్రార్థన చేసి వస్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం సిటిఎంకు చెందిన ముబారక్(20) కురబలకోట మండలం చేనేతనగర్‌లో అమ్మమ్మ ఇంటికి రంజాన్ పండుగకు వచ్చాడు. స్థానికంగా ఉన్న ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు ముగించుకుని బైకులో ఇంటికి బయలుదేరగా, మార్గంమధ్యలోని విశ్వం కాలేజీ వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముబారక్‌ను స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధురామచంద్రుడు తెలిపారు.


