ప్రజాస్వామ్య గొంతుకపై ప్రత్యేక కత్తి! | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య గొంతుకపై ప్రత్యేక కత్తి!

Mar 21 2026 5:19 AM | Updated on Mar 21 2026 5:19 AM

ప్రజాస్వామ్య గొంతుకపై ప్రత్యేక కత్తి!

కడప కార్పొరేషన్‌: జిల్లాలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజాస్వామ్య పాలనను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. 2021 మార్చిలో ‘ఫ్యాన్‌’ ప్రభంజనంతో జిల్లాలోని అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసిన వైఎస్సార్‌సీపీ పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం ఈ నెల 17తో ముగిసింది. అయితే, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తమకు బుద్ధి చెబుతారనే భయంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల ఊసెత్తకుండా, పట్టణ పాలనను అధికారుల పరంచేసింది. రాజంపేట మినహా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది.

● గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలోని మున్సిపాలిటీలను లక్ష్యంగా చేసుకుని దమనకాండకు తెరలేపింది. ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించింది.

కడప కార్పొరేషన్‌లో: 11 మంది కార్పొరేటర్లను బెదిరింపులు, ప్రలోభాలతో ఫిరాయింపజేశారు.

ప్రొద్దుటూరులో: 17 మంది కౌన్సిలర్లపై ఒత్తిడి తెచ్చి పార్టీ మార్పించారు. పోలీసు కేసులు, గూండాగిరీతో భయపెట్టినా, మెజారిటీ ప్రతినిధులు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికే కట్టుబడి నిలవడం గమనార్హం.

కుర్చీ కోసం కుట్రలు..

కడప నగరంలో కూటమి నేతల అరాచకం పరాకాష్టకు చేరింది. స్థానిక ఎమ్మెల్యే మాధవికి, మేయర్‌ కొత్తమద్ది సురేష్‌ బాబుకు మధ్య ప్రోటోకాల్‌ విషయంలో తలెత్తిన వివాదాన్ని సాకుగా చూపి, కేవలం కుర్చీ వేయలేదన్న అల్ప కారణంతో జీహెచ్‌ఎంసీ చట్టంలోని లొసుగులను వాడుకుని మేయర్‌పై అనర్హత వేటు వేయించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఎన్ని కుతంత్రాలు పన్నినా మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రతినిధే మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడం కూటమి నేతలకు ఎదురుదెబ్బ తగిలింది.

అభివృద్ధికి గండి.. ప్రజలకు ఇబ్బందులు

తమకు అనుకూలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం వివక్ష చూపింది. పట్టణాల అభివృద్ధి కంటే రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు ప్రత్యేకాధికారుల పాలన రావడంతో సామాన్య ప్రజలు తమ సమస్యల కోసం అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక సమస్య వస్తే అడిగే దిక్కు లేని పరిస్థితి పట్టణాల్లో నెలకొంది.

జిల్లాలో ముగిసినమున్సిపల్‌ పాలకవర్గాల గడువు.

రాజంపేట మినహా నేటి నుంచిప్రత్యేకాధికారుల చేతుల్లోకి పురపాలన..ప్రజలకు తప్పని తిప్పలు.

కూటమి సర్కార్‌ కుట్రలు, ఫిరాయింపుల మధ్యే ఐదేళ్ల ప్రస్థానం.

నిధులు ఆపి.. అభివృద్ధిని అడ్డుకున్నా..వెరవని వైఎస్సార్‌సీపీ సైనికులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement