కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయ లక్ష్యాలను వంద శాతం సాధించేలా అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎకై ్సజ్, మైనింగ్, అటవీ, రిజిస్ట్రేషన్, రవాణా, మున్సిపల్ మరియు వాణిజ్య పన్నుల శాఖల పనితీరుపై ఆయన క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, గృహ పన్నుల కంటే వాణిజ్య సంస్థల నుంచి వసూలు చేసే పన్నులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వాణిజ్య సంస్థల నుంచి ప్రోపోర్షనల్ టాక్స్ వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని, వసూళ్ల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం పెరగాలని, ప్రతి వారం బిల్లుల ప్రాసెసింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో పంచుకోవాలని కోరారు. ఆదాయ లక్ష్యాల సాధనలో వెనుకబడిన శాఖలు తక్షణమే మెరుగుపడాలని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


