జజ్జనకర జనారే.. జాతర భళారే ! | - | Sakshi
Sakshi News home page

జజ్జనకర జనారే.. జాతర భళారే !

Mar 11 2026 7:44 AM | Updated on Mar 11 2026 7:44 AM

వైభవంగా ప్రారంభమైన

సుగుటూరు గంగమ్మ జాతర

పట్టువస్త్రాలు సమర్పించిన

మాజీ మంత్రి పెద్దిరెడ్డి దంపతులు

పుంగనూరు : పుంగనూరులో గంగమ్మ జాతర సంబరం అంబరాన్నంటింది. జమీందారుల కుల దైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర వేడుక మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలుత ప్యాలెస్‌లో అమ్మవారికి జమీందారులు సోమశేఖర్‌ చిక్కరాయల్‌, మల్లికార్జునరాయల్‌, వారి కుటుంబ సభ్యులు తొలి పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ కలసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమీందారులను మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా అమ్మవారిని పట్టణంలో ప్యాలెస్‌ వీధి, తేరువీధి, సెంటర్‌లాడ్జి, సుబేదారువీధి, తూర్పుమొగశాల, కుమ్మరవీధి మీదుగా కట్టక్రిందపాళ్యెం నుంచి బుధవారం వేకువజామున ప్యాలెస్‌ ఆవరణలోని ఆలయంలోకి తీసుకువచ్చి ప్రజల దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా బెస్తకులస్తులు, అసాధికులస్తులు, తోటికులస్తులు అమ్మవారికి సారెలు సమర్పించి, పూజలు చేశారు. అనంతరం జమీందారులు వారి సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయంలో తొలి పూజలు చేశారు. తరువాత అమ్మవారిని భక్తుల దర్శనార్థం అనుమతించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, హిందూపురానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి వేణు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వజ్రభాస్కర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రెడ్డెమ్మ, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతర ప్రారంభం

శ్రీ సుగుటూరు గంగమ్మను అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన పల్లకీలో ఉంచి పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో వందలాది జంతుబలులు సమర్పించి, ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి నెయ్యి దీపాలు, పెరుగన్నం పెట్టి మొక్కులు చెల్లించారు.

గంగమ్మలకు పూజలు

శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా పట్టణంలోని గంగమ్మలకు పూజలు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బస్టాండ్‌లో గల శ్రీవిరూపాక్షి మారెమ్మకు పూజలు చేశారు. అలాగే తూర్పుపాళెంలో గల స్థల గంగమ్మ, పలమనేరు రోడ్డులో గల మల్లారమ్మ, తూర్పుమొగశాలలో గల నల్లగంగమ్మ, కట్టక్రిందపాళెంలోని పడమటి గంగమ్మ, చెరువుకట్టపై ఉన్న నీళ్లరాళ్ల గంగమ్మ, కోనేరు వద్ద గల బోయకొండ గంగమ్మ, బజారువీధిలో గల నడివీధి గంగమ్మలకు ప్రత్యేక పూజలు చేసి, బలులు సమర్పించారు.

అమ్మవారికి పట్టువస్త్రాలు, కానుకలు సమర్పిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, స్వర్ణమ్మ దంపతులు, అమ్మవారి ఊరేగింపులో భారీగా పాల్గొన్న భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement