విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఎస్టేట్ ప్రాంతానికి చెందిన మస్తాన్ కుమారుడు మహమ్మద్ ముజిబుల్(19) స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందినా నయం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్లే సమయంలో మరోసారి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో భరించలేక ఇంట్లో ఉన్న వాస్మోల్ ఆయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని వెంటనే స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
టెంపో బోల్తా
పుంగనూరు : పట్టణ సమీపంలోని భగత్‌సింగ్ కాలనీ వద్ద గల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం సమీపంలో మంగళవారం రాత్రి టెంపో బోల్తా పడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి రోడ్డు పైభాగం నుంచి టెంపో కిందికి పడటంతో టెంపో పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే ఈతలో రెండు దూడలు
సదుం : సదుం మండలంలోని జోగివారిపల్లె పంచాయతీ కంభంవారిపల్లెలోని రైతు నాగభూషణ రెడ్డికి చెందిన పాడి ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు మంగళవారం జన్మనిచ్చింది. దీనిని చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు.
గాయపడిన వ్యక్తి మృతి
ముద్దనూరు : ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సంజీవ్(50) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ఏఎస్‌ఐ రమేష్ సమాచారం మేరకు.. ఈ నెల 22వ తేదీన మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన సంజీవ్ గొర్రెల కొనుగోలుకు కొసినేపల్లె గ్రామానికి వెళ్లాడు. గొర్రెలను కొనుగోలు చేసి ఆటోలో ప్రయాణిస్తున్నాడు. రహదారిలో ఏర్పాటు చేసిన బారికేడ్ సంజీవ్ తలకు తగలడంతో ఆటోలో నుంచి కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రున్ని 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం


