వ్యక్తిపై కానిస్టేబుల్ దాడి
● సివిల్ కేసులో జోక్యం చేసుకుని దౌర్జన్యం
● ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
పీలేరు రూరల్ : పోలీస్ స్టేషన్‌కు పిలిస్తే రావా అంటూ.. ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా కానిస్టేబుల్ దాడి చేసిన సంఘటన కలికిరి పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. మంగళవారం బాధితుడు కలికిరి పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా వున్నాయి. కలికిరి మండలం మర్రికుంటపల్లె పంచాయతీ నడింపల్లెలో నివాసం ఉంటున్న బొజ్జ చలమయ్య (50)కు ఆయన సోదరులు బొజ్జ శివయ్య, బొజ్జ మల్లికార్జునకు ఉన్న కుటుంబ ఆస్తులను 2010 జూలై 14న భాగపరిష్కారం చేసుకున్నారు. సర్వే నంబరు 433లో వారి భాగానికి వచ్చిన ఆస్తిని అనుభవించుకుంటున్నారు. అయితే వారికి చెందిన భూమిని ఆక్రమించుకోవడానికి అదే గ్రామానికి చెందిన భద్రయ్య, సుధాకర, శ్రీనివాసులు, విశ్వనాథ, నాగరత్న, గంగాదేవి ప్రయత్నించారు. దీంతో కోర్టు ద్వారా ఐఈ నంబరు 18/2026 ఇంజక్షన్ ఆర్డరు పొందారు. అయినా దౌర్జన్యం చేస్తుండడంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా బాధితులు అర్జీ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 26న సాయంత్రం 6.30 గంటలకు కలికిరి పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మదనమోహన్‌రెడ్డి ఫోన్ చేసి బొజ చలమయ్యను స్టేషన్‌కు పిలిపించాడు. ‘పిలిచిన వెంటనే స్టేషన్‌కు రావా అంటూ నన్ను అక్రమంగా, అన్యాయంగా నిర్బంధించి విచక్షణా రహితంగా కొట్టి, బెదిరించి, నా చేత బలవంతంగా ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకుని, రెండు రోజుల లోపల నా సివిల్ కేసును వాపసు తీసుకుని, మా కుటుంబానికి సంబంధించిన భూమిని పైవారికి వదిలేయాలని నన్ను భయభ్రాంతులకు గురి చేశారు’ అని చలమయ్య పేర్కొన్నాడు. హెడికానిస్టేబుల్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సివిల్ కేసు పరిష్కార విషయంలో తలదూర్చి దౌర్జన్యంగా వ్యవహరించారని బాధితుడు వాపోయాడు. తన చర, స్థిర ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరాడు. బాధితుడు పీలేరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సివిల్ కేసులు
శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
బాధితుడు చలమయ్యపై హెడికానిస్టేబుల్ దాడి చేసిన విషయమై ఎస్‌ఐ పి.వి. రమణను వివరణ కోరగా తాను సోమవారం విధుల నిమిత్తం కడపకు వెళ్లి రాత్రి పోలీస్‌స్టేషన్‌కు రావడం జరిగిందని తెలిపారు. తనకు అందిన సమాచారం మేరకు గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి పరిష్కరించుకోవాలని, గ్రామాల్లో ఎలాంటి గొడవలు సృష్టించరాదని సూచించినట్లు తెలిపారు.


