8 మంది గురుకుల విద్యార్థుల అదృశ్యం
● అర్ధరాత్రి బయటికి వెళ్లి తిరుపతికి..
● వారిలో రాత్రికి ఇద్దరు తిరిగొచ్చారు
బి.కొత్తకోట : బి.కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఒకేసారి గోడదూకి పరారయ్యారు. ఈ సంఘటనతో గురుకుల సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎక్కడికి వెళ్లారో తెలియక ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాల తర్వాత.. తిరుపతిలో ఉన్నట్టు తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గురుకుల విద్యాలయంలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు సోమవారం రాత్రి ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది అంతా నిద్రించాక అర్ధరాత్రి దాటాక గురుకులం నుంచి పరారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున స్టడీ అవర్ కోసం విద్యార్థులను నిద్రలేపేందుకు వెళ్లగా ఎనిమిది మంది అదృశ్యమైనట్టు నిర్ధారించారు. దాంతో ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. ఎక్కడికి వెళ్లారో ఎందుకు వెళ్లారో తెలియని భయాందోళనకు గురయ్యారు. తర్వాత ఓ ఉపాధ్యాయుడు తెలిసిన వారితో ఆరా తీయగా.. ఆ విద్యార్థులంతా తిరుపతిలో ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. వారిలో ఓ విద్యార్థి బంధువు ద్వారా వారిని సురక్షితంగా గురుకులానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు మంగళవారం రాత్రి గురుకులానికి చేరుకోగా ఒకరిని వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకునిపోగా, మరో విద్యార్థి గురుకులంలోనే ఉన్నాడు. మిగిలిన ఆరుగురిని గురుకులానికి తీసుకువస్తున్నారు. అయితే ఈ విద్యార్థులు ఎందుకు పరారయ్యారు, దానికి కారణాలేమిటన్న దానిపై ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఏమీ చెప్పడం లేదు. దీనిపై ప్రిన్సిపాల్ ప్రసాద్‌ను వివరణ కోరగా పరారైన విద్యార్థులు ఎందుకోసం వెళ్లారో వాళ్లొచ్చినాక తెలుసుకుంటామని చెప్పారు. తమకు కూడా కారణాలు తెలియవని చెప్పారు. ఇద్దరు విద్యార్థులు తిరిగి వచ్చారని, మిగిలిన ఆరుగురు తిరుపతి నుంచి వస్తున్నారని రాత్రి చెప్పారు. కాగా మూడేళ్ల క్రితం గురుకుల విద్యార్థులు 15 మందికిపైగా విద్యాలయం నుంచి రాత్రి వేళలో గోడలు దూకి అదృశ్యం కావడం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.


