సర్వం సిద్ధం
ఆకట్టుకున్న రిహార్సల్స్
రిపబ్లిక్ డే వేడుకలకు
మదనపల్లె రూరల్: అన్నమయ్యజిల్లా కేంద్రం మదనపల్లెలో తొలిసారిగా జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవాలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పట్టణంలోని బెంగళూరురోడ్డు బీటీ కాలేజ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఆదివారం జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ శర్మ, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధనరావు... రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సభావేదిక, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీ, స్టాల్స్, శకటాల రూపకల్పన, సీటింగ్ అరేజ్‌మెంట్ తదితర అంశాలపై పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులకు తాగునీరు, గ్యాలరీ సీటింగ్, పార్కింగ్ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు పంపాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. కార్యక్రమ షెడ్యూల్‌లో భాగంగా... ఉదయం 8.15 గంటలకు అన్ని దళాలు బేస్‌లైన్ వద్దకు చేరుకుంటాయన్నారు. 8.50 గంటలకు జిల్లా ఎస్పీ రాక, పరేడ్ ద్వారా జనరల్ సెల్యూట్ సమర్పణ, 8.55 గంటలకు జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ వచ్చి జాతీయ పతాకావిష్కరణ చేస్తారన్నారు.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బీటీ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. పరేడ్ రిహార్సల్స్‌కు జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ శర్మ, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హాజరై పరేడ్‌ను పరిశీలించారు. పరేడ్ కమాండర్ నుంచి ఎస్పీ ఽధీరజ్ కునుబిల్లి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు ప్రదర్శించిన ప్రత్యేక విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. కళ్లకు గంతలు కట్టుకుని అత్యంత వేగంగా అత్యాధునిక ఆయుధాలను విడదీయడం, తిరిగి అమర్చడం తదితర విన్యాసాల్లో సిబ్బంది నైపుణ్యాన్ని ఎస్పీ అభినందించారు. ఆత్మరక్షణపై పోలీసులు చేసిన మాబ్ ఆపరేషన్ డెమో ఆకట్టుకుంది.
ముస్తాబైన బీటీ కాలేజ్ గ్రౌండ్


