
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పండితులకు శాపం
● పదోన్నతుల కోసం
పదేళ్లుగా పండితుల పాట్లు
● ఏడాదికోమారు మారుమూల
ప్రాంతాలకు బదిలీ
● సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయని కూటమి ప్రభుత్వం
పండితుల పదోన్నతులపై ఆరేళ్లుగా ఊరించి.. ఇపుడు అట్టకెక్కించారు. భాషోపాధ్యాయులకు ఇష్టం లేకపోయినా ఏడాదికోమారు భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడిపడితే అక్కడికి బదిలీలు చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. వందల కిలోమీటర్ల దూరానికి జిల్లాలు మార్చి బదిలీలు చేస్తూ వారిని బలి పశువులు చేస్తున్నారు. తమ పిల్లల చదువులకు బ్రేకులు పడతున్నా భరిస్తూ.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
బద్వేల్ : రాష్ట్ర వ్యాప్తంగా 2019లో భాషోపాధ్యాయుల(తెలుగు,హిందీ,ఉర్దూ,సంస్కతం,కన్నడ) పదోన్నతులు జరిగాయి. 13 ఉమ్మడి జిల్లాల్లో 1134 మంది మిగిలి పోగా వైఎస్సార్ కడప జిల్లాలో 114 మంది డీఈఓ పూల్‌లో ఉన్నారు. వీరిలో తెలుగు పండితులు 68, హిందీలో 33, ఉర్దూలో 13 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరిది విద్యా శాఖలో ఏ విభాగమో అర్థంకాకుండా పోయింది. ఫలితంగా ఏడాదికో మారు జిల్లా నుంచి జిల్లాకు, కనీస వసతులు లేని మారుమూల గ్రామాలకు బదిలీ చేసి బలితీసుకుంటున్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలుకానివైనం
ఆరేళ్లుగా ఏడాదికోమారు బదిలీలతో విసిగి వేసారిన భాషాపండితులు ఏదో చోట ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 1134 మంది బాషోపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. వారి బాధలను క్షుణంగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ జడ్జి మన్మధరావు వెంటనే పదోన్నతులు కల్పించాలని, సమాన పనికి తగిన వేతనం ఇవ్వాలని 20 డిసెంబర్, 2024లో తీర్పు ఇచ్చారు. అయితే హైకోర్టు ఆదేశాలు జారీచేసి తొమ్మిది నెలలు కావస్తున్నా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. పదోన్నతుల అమలులో తాత్సారం చేయడంతో భాషోపాధ్యాయులు నష్టపోతగున్నారు. తమకు పదోన్నతులు కావాలని సెకండ్‌గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా కోర్టు యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. అనంతరం భాషా పండితులు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 2న స్టేటస్ కో ఎత్తివేసింది.
ఉసూరుమనిపించిన ప్రభుత్వం: హైకోర్టు ధర్మాసనం స్టేటస్‌కో ఎత్తివేసిన వెంటనే భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించి సెప్టెంబర్ 4న (ఈ నెల) అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించింది. ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందనే ఆశతో బాషోపాధ్యాయులంతా డీఈవో కార్యాలయాల్లో డిక్లరేషన్ రాసిచ్చారు. తమకు పదోన్నతి ఉత్తర్వులు వస్తాయని ఆశపడే సమయంలో కూటమి ప్రభుత్వం మరల మెలికపెట్టి ఆ ప్రక్రియను ఆపేసింది. ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీసు ఉన్న వారికి పదవీ విరమణ చేసేలోగా రెండు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. బాషా పండితుల విషయంలో దశాబ్ద కాలంగా ఇది అమలు చేయడంలేదు. ఇరవై ఏళ్ల కిందట చేరినవారు కూడా పదోన్నతి లేకుండానే పదవీవిరమణ పొందారు.