
తిరస్కరించిన వారినే.. తీసుకొచ్చారు
● టీడీపీ కడప నగర నూతన కమిటీ నియామకం
● పార్టీకి పనిచేసేన వారిని
పక్కన పడేశారని అసంతృప్తి
● తమ్ముళ్ల తిరుగుబాటు వేళ నిర్ణయంపై ఆగ్రహం
కడప రూరల్ : కడప నగరం తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు గరంగరంగా మారాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిర్ణయాలపై ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పాతకడప కృష్ణారెడ్డి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కమలాపురానికి వెళ్లి తమకు న్యాయం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని శరణు కోరడంతో పెద్ద దుమారమే రేగింది. అనంతరం పార్టీని ఫిరాయించిన కార్పొరేటర్లు కూడా పాత కడప కృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉన్నా.. పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కడప నగర నూతన కమిటీని నియమించారు. నగర అధ్యక్షుడిగా పఠాన్ మన్సూర్ అలీఖాన్, ఉపాధ్యక్షుడిగా పసుపులేటి గౌతమ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ముక్కా సుబ్బారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బోనం వెంకటేశ్, గండ్లూరి బాబా ఫకృద్దీన్, ఇప్పిరాల పూర్ణచంద్రరావు, కార్యదర్శులుగా కోనేటి వెంకటేశ్ ఆచారి, గోగుల శ్రీనివాసులు, జి.నరేష్, కోశాధికారిగా మలిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలను నియమించారు. దీంతో తమ్ముళ్ల వివాదానికి మరింత ఆజ్యం పోసినట్‌లైౖంది. ఇదివరకే నగర కమిటీ వ్యవహారంపై పార్టీ అఽధిష్ఠానం కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. చాలా మంది అభ్యర్ధుల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ కమిటీని అధిష్టానం ‘రిజక్ట్’ చేసిందనే ప్రచారం జరిగింది. తీరా చూస్తే వారినే కొత్త కమిటీలో చేర్చడంతో తమ్ముళ్ల అసంతృప్తి సెగలు ఎగసిపడ్డాయి. పార్టీ ఫిరాయించిన వారితోపాటు టీడీపీలో గుర్తింపు లేని వారికి చోటు కల్పించడం దారుణమని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తాము తిరస్కరించినా, తమ పంతం, ఆధిపత్యం కోసం కమిటీ నియమించారని తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేసిన కార్యకర్తలను పక్కన పడేశారని ఆరోపిస్తున్నారు.
తప్పు చేయొద్దంటే...తిరుగుబాటు చేస్తావా
– పాత కడప కృష్ణారెడ్డిపై విరుచుకుపడిన కార్పొరేటర్లు
పాత కడప కృష్ణారెడ్డి చేయని అక్రమాలంటూ లేవు.. టీడీపీలో ఉంటూ ఆయన ఒక్కడే లబ్ధి పొందాడు.. ఇపుడు తప్పు చేయవద్దంటే తిరుగుబాటు చేస్తున్నాడు అని పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు సూర్యనారాయణ, సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మంగళవారం వారు మాట్లాడుతూ కృష్ణారెడ్డి సొసైటీ డైరెక్టర్‌గా పదవి అనుభవిస్తూ పార్టీపైనే విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, సొంత కుటుంబ సభ్యుల ఆస్తులను కాజేసిన నైజం కృష్ణారెడ్డిదని దుయ్యబట్టారు. డీలర్లను కూడా వదలిపెట్టలేదన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించి తాము టీడీపీలో చేరామని, ఇపుడు అభివృద్ధిచూసి ఓర్వలేక కృష్ణారెడ్డి ఆరోపణలు చేయడం తగదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి వద్ద ఉంటూ పెద్ద ఎత్తున లబ్ధి పొందారని వారు ఆరోపించారు. కడపలో ఏదో జరుగుతోందని కృష్ణారెడ్డి తన అనుచరులను వెంటేసుకుని పెద్దాయన పుత్తా నరసింహారెడ్డి వద్దకు వెళ్లారన్నారు. ఆయనకు కడపలో జరుగుతున్న అంశాలపై పెద్దగా తెలియదన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిత్యం అక్రమాలకు పాల్పడే నువ్వు మమ్మల్నే బెదిరిస్తావా....రా చూసుకుందాం అంటూ కృష్ణారెడ్డికి సవాల్ విసిరారు. కార్యక్రమంలో జఫ్రుల్లా, చల్లా రాజశేఖర్, బాలకృష్ణారెడ్డి, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.