
ప్రభుత్వ భూమి కబ్జా
సాక్షి కడప: అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళాయిపల్లి పంచాయతీ కేతరాజుపల్లె గ్రామ రెవెన్యూ 205, 206 సర్వే నంబర్లలోని సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు ఆక్రమించినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని... అంతేకాకుండా ఆక్రమించారని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటం ఎంత వరకు న్యాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. అందుకు సంబంధించి శుక్రవారం ఈశ్వరయ్య జరిగిన ఆక్రమణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, రాష్ట్ర డీజీపీలకు ఆయన ఫిర్యాదు చేశారు. సత్వరం విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. దళాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు రాజారెడ్డి, వెంకటసుబ్బయ్య, వెంకటరెడ్డి, ప్రభుత్వ భూమిని ఆక్రమించడం.. ఈనెల 9న పుల్లంపేట తహసీల్దార్‌కు ప్రభుత్వ భూమి కబ్జా అయిందని సీపీఐ నాయకత్వానా విన్నవించామన్నారు. ఆ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్‌ఓ కబ్జాదారులకు సమాచారం అందించగా అది తెలుసుకున్న టీడీపీ నాయకులు 10 తేదీ రాత్రి 9 గంటలకు పుల్లంపేట మండల సీపీఐ కార్యదర్శి సెల్వకుమార్‌కు ఫోన్ చేసి రాత్రి పూట పిలిపించి అత్యంత దారుణంగా తిట్టారని, బెదిరించారని వివరించారు. దాంతో సరిపెట్టుకోకుండా 11వ తేదీ అర్ధరాత్రి 1 గంట సమయంలో సెల్వకుమార్, నిండు గర్భిణి అయిన భార్య బిందు ప్రియపై దాడి చేశారని తెలిపారు. ఆరుబయట నిద్రిస్తుండగా సెల్వకుమార్‌తోపాటు ఆయన భార్యపై టీడీపీ నాయకులు రాజారెడ్డి, వెంకటసుబ్బయ్య, వెంకటరెడ్డి, సాయికుమార్‌తోపాటు మరో పది మంది దాడి చేయడంతోపాటు భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. అప్పటికి భార్యభర్తలు ఇరువురు ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకోగా వాకిళ్లను తన్నుతూ భయపెట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇంటి ఆవరణలో ఉన్న ఎయిర్ కూలర్, టీవీఎస్ ఎక్సెల్‌ను ధ్వంసం చేయడంపై ఈశ్వరయ్య మండిపడ్డారు. ఇప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ పలు పర్యాయాలు భూమి కబ్జా జరుగుతున్న విషయం తెలియజేసినా తహసీల్దార్ పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించడంతోపాటు ఈవీఎంలు పగులగొట్టిన చరిత్ర ఉందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూములను కాపాడాలని సీఎం, డిప్యూటీ సీఎం, హోమంత్రి, డీజీపీలను ఈశ్వరయ్య కోరారు. అందుకు సంబంధించి వారికి వినతి పత్రం అందించారు.
పట్టించుకోని అధికారులు
ఫిర్యాదు చేసిన సీపీఐ మండల కార్యదర్శి సెల్వకుమార్
ఫిర్యాదు చేశారనిభార్యతోపాటు సెల్వకుమార్‌పై టీడీపీ నాయకుల దాష్టీకం
సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య

ప్రభుత్వ భూమి కబ్జా