
ఆర్టీసీ అద్దెబస్సు బోల్తా
సిద్దవటం : సిద్దవటం నుంచి కడపకు వెళ్తున్న ఏపీ39యుజీ4591 నెంబర్ అల్ట్రా పల్లె వెలుగు ఆర్టీసీ అద్దె బస్సు బుధవారం భాకరాపేట సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తా పడింది. ఈ బస్సులో బస్సు డ్రైవర్ వెంకటనారాయణ, కండెక్టర్ శివయ్యతోపాటు భారతీ, వెంకటేష్, సుబ్బనరసమ్మ, లక్ష్మమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. అద్దె బస్సు డ్రైవర్ వెంకటనారాయణ కథనం మేరకు..భాకరాపేట సమీపంలోని పెద్దవంక కల్వర్టు వద్ద కడప నుండి బద్వేల్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సు అతి వేగంగా వస్తుండగా కల్వర్టు రహదారిపై బస్సు నిలిపివేయడం జరిగిందన్నారు. బస్సులో అరవై మందికిపైగా ప్రయాణీకులు ఉన్నారని, బస్సు అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. కండక్టర్ శివయ్యపై ప్రయాణికులు పడటంతో చేతికి గాయాలయ్యాయన్నారు. మరో నలుగురు ప్రయాణీకులకు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. విషయాన్ని తెలుసుకున్న 11వ బెటాలియన్ పోలీసులు బస్సు అద్దాలను పగులుగొట్టి గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్, బద్వేల్, కడప ఆర్డీఓలు జాన్‌ఇర్విన్, చంద్రమోహన్, 11వ ఏపీఎస్పీ వెంకటేశ్వర్లు, బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్, కమాండెంట్ ఆనంద్‌రెడ్డి, ఒంటిమిట్ట సీఐ బాబు, ఎస్‌ఐ మహమ్మద్ రఫీ, ఆర్‌అండ్‌బీ ఏఈ రామాంజనేయులు, డిప్యూటీ తహసీల్దారు మాధవీలత సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనకు దారి తీసిన కారణాలను తెలుసుకున్నారు. ఎస్‌ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకొని బోల్తాపడిన ఆర్టీసీ బస్సును రెండు క్రేన్ల సహాయంతో తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. కల్వర్టు వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లేందుకు హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశామని తెలిపారు. ఆర్టీసీ కండక్టర్ శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
డ్రైవర్, కండక్టర్‌తో సహా,
నలుగురికి స్వల్ప గాయాలు

ఆర్టీసీ అద్దెబస్సు బోల్తా