
ఆన్‌లైన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య
పీలేరు రూరల్ : ఆన్‌లైన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పీలేరు పట్టణం కట్టుకాలువ వీధికి చెందిన షేక్ ముబారక్ (25) పట్టణంలోని కడప రోడ్డు మార్గంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యాపారనిమిత్తం ఆన్‌లైన్ యాప్‌లో అప్పు తీసుకుని వ్యాపారం నిర్వహించాడు. వ్యాపారం సరిగ్గా జరగక అప్పు చెల్లించలేక ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్ యాప్ నిర్వాహకులు వేధింపులు తాళలేక మంగళవారం తన ఇంటిలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.
కూలిన పాఠశాల గోడ
చిట్వేలి : చిట్వేలి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీకి సంబంధించిన గోడ బుధవారం కురిసిన వర్షానికి ఒకచోట కూలిపోయింది. పాఠశాల ప్రారంభంగాక మునుపే ఉదయం ఏడు గంటల సమయంలో గోడ కూలింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సంఘటనా స్థలాన్ని ప్రధానోపాధాయులు దుర్గరాజు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
రాయచోటి: పక్షవాతాన్ని జయించలేక ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఓ యువతి తనువు చాలించింది. పట్టణంలోని పాత రాయచోటిలో నివాసముంటున్న గౌస్ మొహిద్దీన్ భార్య షేక్ మునీరా(39) గత ఆరు నెలలుగా పక్షవాతంతో బాధపడుతోంది. ఆసుపత్రులలో చికిత్స పొందినా.. ఆరోగ్యం మెరుగు పడక పోవడంతో మానసికంగా కుంగిపోయింది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. సాయంత్రం 5.30గంటలకు భర్త వచ్చి చూడగా అప్పటికే ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆన్‌లైన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య