
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్ : పేద విద్యార్థులకు వైద్యరంగంలో మరింత అవకాశాలు కల్పించాలనే దూరదృష్టితో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడకల్ కాలేజీల స్థాపనకు శ్రీకారం చుట్టిందని, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడాన్ని అందరూ వ్యతిరేకించాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగం రెడ్డకిశోర్‌దాస్ అన్నారు. రాయచోటిలో బుధవారం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో రూ.8,500 కోట్ల వ్యయంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోపిడీ చేయగా ప్రభుత్వాసుపత్రులు మాత్రం పేదలకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.2.15 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసిన చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడం ఆపేయాలన్నారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం నిజాయితీగా పూర్తి చేయాలని కోరారు. ఈ నెల 19న ఉదయం 9.30 గంటలకు మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శానిటోరియం వద్ద చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నామని రెడ్డికిశోర్‌దాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.