
నేడు చలో మెడికల్ కళాశాల
మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మదనపల్లె సమీపంలోని శానిటోరియం వద్ద గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 95 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మాణం చేపట్టింది. ఈ కళాశాలను ప్రైవేటుకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి ఆ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. వీరంతా మెడికల్ కళాశాల వద్దకు చేరుకుని.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన భవనాల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అక్కడే నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ ప్రైవేటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. భారీ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల రాక
17 నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న నేతలు
వైద్య కళాశాల వద్ద నిరసన