
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి
పీలేరు: జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పీలేరు నియోజకవర్గంలోని అన్ని శాఖల నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని సర్పంచ్ హబీబ్‌బాషా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 12 నెలలుగా ఆర్‌వో ప్లాంట్ల వాటర్‌మెన్లకు జీతాలు ఇవ్వలేదని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు, డీపీవో రాధమ్మ, జీఎస్‌డబ్ల్యూ ఎస్.లక్ష్మీపతి, నియోజకవర్గంలోని మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి నియోజకవర్గ ప్రగతికి చర్యలు
రాయచోటి: రాయచోటి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకునేలా శాఖల వారీగా ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో రాయచోటి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగునీరు, తాగునీటిపై సమీక్ష చేసి, నియోజకవర్గంలోని చిన్న మధ్య తరహా ప్రాజెక్టులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.