
క్లుప్తంగా
ఉపాధ్యాయుడి హఠాన్మరణం
చిన్నమండెం : మండలంలోని టి.చాకిబండ జడ్పీ హైస్కూల్(తెలుగు)లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీధర్‌రెడ్డి(55)కి పాఠశాలలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. రోజు మాదిరిగా ఉదయం పాఠశాలకు వచ్చిన ఆయన హఠాత్తుగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా తూర్పుపల్లి వద్దకు రాగానే మృతి చెందారు. శ్రీధర్‌రెడ్డి సొంత ఊరు సంబేపల్లె మండలం మొటుకువాండ్లపల్లె. ప్రస్తుతం చిన్నమండెం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు కలరు. మండలంలోని తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వైన్ షాపులో చోరీ
గుర్రంకొండ : మండలంలోని గుర్రంకొండలోని ఆర్‌కే బ్రాందీషాపులో చోరీ జరిగింది. స్థానిక తూముకుంట రోడ్‌లో ఆర్‌కే బ్రాందీషాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం వేకువ జామునే గుర్తుతెలియని దుండగులు బ్రాందీషాపు పైభాగంలో రేకు కత్తిరించి దుకాణంలో ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దుకాణంలోని ఓ ల్యాప్‌టాప్, రూ.50 వేల విలువ చేసే మద్యం సీసాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ రఘరామ్ సిబ్బందితో కలసి వచ్చి వైన్ షాపు, చోరి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. షాపు నిర్వహకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎరచ్రందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అన్నమయ్య జిల్లా కేవీ.బావి అటవీ ప్రాంతంలో తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్, సిబ్బంది కోడూరు పరిధిలోని కెవీ.బావి ఆటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున నొక్కోడి గుండం వద్ద కొందరు వ్యక్తులు ఎరచ్రందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులను చూసి వారు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. దుంగలతో పాటు వారిద్దరినీ తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా

క్లుప్తంగా