
రూ.20వేల చెక్కును రూ.2.20 లక్షలుగా మార్చి
● పెద్దినేనికాలువ సర్పంచ్ బంధువు ఫోర్జరీ
● చెక్కు మార్చారని ప్రశ్నిస్తే
అధికారులపై దూషణపర్వం
● గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శికి
గుండెపోటు
సుండుపల్లె : గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులకు ఇచ్చిన రూ.20 వేల చెక్కును రూ.2.20 లక్షలకు మార్చిన సంఘటన సుండుపల్లె మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. పెద్దినేనికాలువ పంచాయతీలో పనులు చేసినందుకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి సర్పంచ్ సంతకంతో కూడిన రూ.20 వేల చెక్కును ఆ సచివాలయ పంచాయతీ కార్యదర్శి శ్రీనాథ్‌రెడ్డి సర్పంచ్ బంధువైన పసుపులేటి నాగేంద్రకు రాసి ఇచ్చారు. అయితే ఆ సర్పంచ్ బంధువైన పసుపులేటి నాగేంద్ర రూ.20 వేల చెక్కులో అంకెలు మార్చి రూ.2.20 లక్షలుగా రాసి ఆ నగదును తన సొంత అకౌంట్లోకి జమచేసుకున్నాడు. పంచాయతీ నిధుల నుంచి రూ.2.20 లక్షల నగదు డ్రా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి చరవాణికి సమాచారం రావడంతో చూసి ఆశ్చర్యపోయిన ఆయన వెంటనే తమపై అధికారులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. డిప్యూటీ ఎంపీడీఓ సురేష్‌బాబుతో కలిసి బ్యాంకుకు నిధులు ఆపాలని బ్యాంకు మేనేజర్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు నిధులు డ్రా చేసిన వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్ చేశారు. అప్పటికే ఆ అకౌంట్ నుంచి రూ.20 వేల నగదు డ్రా చేసినట్లు వారు తెలిపారు. రూ.20 వేల చెక్కును రూ.2.20 లక్షలుగా ఎందుకు మార్చావని డ్రా చేసిన వ్యక్తిని పంచాయతీ కార్యదర్శి ప్రశ్నించగా తీవ్ర పదజాలంతో దూషించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటికి గుండెనొప్పి వస్తుండటంతో సిబ్బంది గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.