
దేశ భద్రతలో సీఆర్‌పీఎఫ్ కీలక పాత్ర
కలికిరి: దేశ భద్రతలో సీఆర్‌పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని సీఆర్‌పీఎఫ్ డీఐజీపీ అనుపమ్ శర్మ అన్నారు. కలికిరి సీఆర్‌పీఎఫ్ (సీఐఏటీ–3) 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వామపక్ష తీవ్రవాదం(ఎల్‌డబ్ల్యూఈ) ప్రాంతాల్లో మోహరించిన దళాలకు కౌంటర్ ఇన్సర్జెన్సీ శిక్షణను అందించడానికి తమిళనాడు రాష్ట్రం అవడిలో 2014 సెప్టెంబరు 15న గ్రూప్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, తరువాత కలికిరిలో ప్రస్తుతం పూర్తి స్థాయి శిక్షణా సంస్థగా ఏర్పాటైనట్లు పేర్కొన్నారు. సైనిక్ సమ్మేళన్ నిర్వహించి కేంద్రంలో జరుగుతున్న వివిధ రకాల శిక్షణ, వసతి, ఇంకా అవసరమైన సదుపాయాలపై వివరించారు. జవాన్‌లతో ముఖాముఖిగా మాట్లాడారు. సీఆర్‌పీఎఫ్ దేశ సేవలో ముందుంటుందని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలికిరి బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు చేపట్టిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సీఐఏటీ స్కూల్ కమాండెంట్ రాజేష్‌కుమార్, అధికారులు, జవాన్‌లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.