
మళ్లీ వాయిదా పడిన గుత్తల వేలం
● పాత పాటదారులకు ఆమోదం
ఇవ్వకపోవడంతో అవస్థలు
● గేటు వసూళ్ల ఆరోపణలపై
అధికారులు దృష్టి పెట్టాలి
మదనపల్లె : 2025–26 ఏడాదికి మదనపల్లె మున్సిపాలిటికి చెందిన వారపుసంత, దినసరి మార్కెట్, టౌన్‌హాలు, ప్రైవేటు బస్టాండ్ గుత్తలను అప్పగించేందుకు వరుసగా ఏడుసార్లు వేలం పాటలను నిర్వహించినా కనీస స్పందన లేకపోతోంది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఏడోసారి వేలంపాటలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు పాటలను నిర్వహిస్తామని కమిషనర్ ప్రమీల ప్రకటించగా పాటదారుల కోసం కార్యాలయంలో ఎదురుచూశారు. పాత పాటదారుడు ఎస్‌ఏ.మస్తాన్ పాటలో పాల్గొనేందుకు వచ్చారు. ఎవరూ రాకపోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. సాయంత్రం పాటదారులు హాజరవుతారని సమాచారంతో అధికారులు ఎదురుచూడగా ఇద్దరు హాజరైనప్పటికి వేలంపై ఆసక్తి చూపకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. దీనితో గుత్తలను అప్పగించేందుకు అధికారులు ప్రయత్నించినా వాటిని నిర్వహించుకునేందుకు లీజుదారుల్లో ఆసక్తి లేదని తేలిపోతోంది. వరుసగా జూలై తొమ్మిది, జూలై 17, జూలై 25, జూలై 30, ఆగష్టు 19, తర్వాత శుక్రవారం ఏడుసార్లు వేలంపాటలను నిర్వహించారు. దీనికోసం పత్రికల్లో ప్రకటనలు కూడా జారీ చే శారు. పరిస్థితి చూస్తుంటే ప్రకటనల కోసం చేసిన ఖర్చు కూడా వృథా అయినట్టే కనిపిస్తోంది.
హెచ్చుపాట..ఆమోదం లేదు
వాస్తవానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గుత్తలకు ఈ ఏడాది మార్చి 25న నిర్వహించారు. ఇందులో వారపుసంతకు రూ.పఠాన్ జాఫర్ ఖాన్ రూ.46.38 లక్షలతో హెచ్చుపాటదారునిగా నిలిచారు. దినసరి మార్కెట్‌కు ఎస్‌ఏ.మస్తాన్ రూ.1,18,64,000తో హెచ్చుపాటదారునిగా నిలిచారు. వీరికి గుత్తలను ఏప్రిల్ ఒకటి నుంచి అప్పగించాలి. అయితే కౌన్సిల్ ఆమోదం లేదని అధికారులు తదుపరి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేశారు. ఈలోపు గత లీజుదారుని గుత్తలీజు పూర్తవ్వడంతో కొత్త లీజుదారులకు అప్పగించలేదు. దీనితో ఏప్రిల్ నుంచి కొంతకాలం మున్సిపల్ సిబ్బంది గేటు ఫీజును వసూలు చేయగా, ఇటివల ప్రయివేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. దీనితో గేటు ఆదాయం ఎంత రావాలో, మున్సిపాలిటికి ఎంత జమ అవుతోందో అధికారులు గుర్తించాలి. గేటు వసూళ్లపై ఆరోపణలు వస్తున్నాయి. గత కౌన్సిల్ సమావేశంలో ఓ కౌన్సిలర్ ప్రయివేటు వ్యక్తులతో గేటు వసూళ్లు చేస్తున్నారని ఫోటోలు చూపి ఆరోపించడం తెలిసిందే.
సిబ్బందికి బాధ్యతలు:
లీజు అప్పగించే వరకు మున్సిపల్ సిబ్బందికి గేటు ఫీజు వసూలు బాధ్యతలు అప్పగిస్తే వసూళ్లు పారదర్శకంగా ఉంటాయని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం గుత్త ఆదాయం ఎంత, ఇప్పుడు రోజువారీ వసూళ్లు ఎంత, ఎంత వసూళ్లు తేడా ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించాలి. ఏటా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఆంచనావేసి మున్సిపాలిటికి ఎంత ఆదాయం దక్కాలన్న దానిపై అధికారులు సమీక్షించి బాధ్యతలు అప్పగిస్తే వసూళ్లు పక్కదారి పట్టకుండా ఆదాయం సమకూరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
మళ్లీ వేలం ప్రకటన :
శుక్రవారం నిర్వహించిన వేలంపాటలకు ఇద్దరు హాజరైనా పాటల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. దీనితో మరోసారి వేలం నిర్వహించేందుకు చర్యలు తీసుకుని ప్రకటన వెలువరిస్తామని కమిషనర్ కే.ప్రమీల తెలిపారు.