
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
కురబలకోట : కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్ద హైవే పక్కనున్న టెర్రకోట కళాకారుడు మనోహర్ ఇంటిలోకి ఆదివారం ఉదయం కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. బాధితుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన నలుగురు యువకులు ఆదివారం హార్సిలీహిల్స్‌కు కారులో బయలు దేరారు. కొంత సేపట్లో హిల్స్ చేరుకోవాల్సి ఉండగా.. సమీపంలోని కంటేవారిపల్లె వద్ద హైవే పక్కన అదుపు తప్పి ఏకంగా టెర్రకోట స్టాల్ ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు ఒక్కసారిగా హతాశులయ్యారు. ఏమైందో ఏమోనని కలవరపడ్డారు. దూసుకెళ్లిన కారు ఒక్కసారిగా ఆగిపోయింది. ఊహించని ఈ సంఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. టెర్రకోట స్టాల్‌లోని కుండలు, బొమ్మలు నలిగిపోయాయి. రేకుల షెడ్డు ఊడిపడింది. టీవీఎస్ వాహనం, మరో మోటార్ సైకిల్ ధ్వంసమైంది. రూ.3 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. కుర్రోళ్లు ఆదమరచి డ్రైవింగ్ చేయడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఆ సమయానికి అక్కడ పెద్దలు టెర్రకోట కుండల పనులు చేసుకుంటున్నారు. పిల్లలకు సెలవు కావడంతో ఆడుకుంటున్నారు. ఇద్దరి పిల్లల్ని సెకన్ల ముందే కుటుంబీకులు లోనికి తీసుకెళ్లారు. దీంతో ఎవ్వరూ ఆ సమయంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఇంకొంచెం లోనికి వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం లేకపోవడంతో హమ్మయ్యా.. అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తప్పిన ప్రమాదం