
నొప్పి మాయం.. సర్జరీ దూరం
● ఫిజియోథెరపీ దివ్య ఔషధం
● దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం
● నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం
రాజంపేట టౌన్ : ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు వివిధ జబ్బుల బారిన పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే తల్లి గర్భం నుంచే అనేక మంది అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. నరాలు, కండరాలు, బుద్ధిమాద్యం వంటి సమస్యలు అనేక మందికి పుట్టుకతోనే వస్తున్నాయి. వీటితోపాటు ఒక వయసు వచ్చాక ఏ కారణం చేత అయినా మనిషి మానసిక సమస్యలు, శారీరక నొప్పులతోపాటు పక్షవాతం తదితర వ్యాధుల బారిన పడతారు. ఇలాంటి వారిని ఆరోగ్యవంతుడిగా చేసేందుకు ఫిజియో థెరపీ ఎంతగానో దోహద పడుతుంది. మర్దనాలు, వ్యాయామాలకు ఆధునిక వైద్య పరికరాలు ఉపయోగించి చికిత్సలు అందించే విధానం ప్రస్తుతం అందుబాటులో ఉంది. కొంత కాలంగా ఫిజియోథెరపీ వైద్యంపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. ముఖ్యంగా పక్షవాతం వంటి జబ్బులకు థెరపీ సేవలతో ఆరోగ్య సిరిని సొంతం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో..
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియో థెరపీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 51 మండలాల్లో ఉన్న భవిత కేంద్రాల్లో అంగవైకల్యం, బుద్ధిమాంద్యం పిల్లలకు ఫిజియోథెరపీ సేవలను వైద్యులు అందిస్తున్నారు. ఇదిలా వుంటే భారతదేశంలో ఫిజియోథెరపీ సేవలు 1951వ సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 8న ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తీర్మానించింది. అందువల్ల 1996 నుంచి ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
ఇవీ ప్రయోజనాలు
ఫిజియోథెరపీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక వయసు వచ్చిన వారిని పట్టిపీడించే ప్రధాన సమస్య కండరాలు పట్టేయడం. అలాగే శరీరంలో వివిధ భాగాల్లో తలెత్తే నొప్పుల సమస్య. అయితే ఈ నొప్పులు రెండు రకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఒకటి మెకానికల్ పెయిన్స్, రెండవది ఫిజికల్ పెయిన్స్. మెకానికల్ పెయిన్స్‌కు ఫిజియోథెరపీ బాగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. పని చేసేటప్పుడు నొప్పులు ఎక్కువగా ఉండటం, విశ్రాంతి సమయంలో నొప్పులు తక్కువగా ఉంటే దీనిని మెకానికల్ పెయిన్స్‌గా వైద్యులు నిర్ధారించారు. అలాగే విశ్రాంతి సమయంలో నొప్పులు ఎక్కువగా ఉంటే దీనిని ఫిజికల్ పెయిన్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. మనిషి నొప్పులను బట్టి వైద్యులు ఫిజియోథెరపీ ప్రారంభిస్తారు. ఇలాంటి నొప్పులకు ఫిజియోథెరపీ దివ్య ఔషధంలా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
నడుం, మోకాళ్ల నొప్పులకు చక్కటి పరిష్కారం
చాలా మందికి ఒక వయసు వచ్చాక నడుము, మోకాళ్ల నొప్పుల సమస్యలు పట్టిపీడిస్తుంటాయి. కొంత మంది ఈ నొప్పులు తట్టుకోలేక ఆపరేషన్లు కూడా చేయించుకుంటారు. అయితే నొప్పులు ప్రారంభమైన వెంటనే ఫిజియోథెరపీ చేయించుకుంటే ఆపరేషన్ అవసరం ఉండదని వైద్యులు చెబుతున్నారు. చిన్నపాటి వ్యాయామాలతో శాశ్వత పరిష్కారం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు.
ప్రసవం తరువాత వచ్చే సమస్యలు నయం
మహిళలకు ప్రసవం తరువాత వచ్చే సమస్యలకు ఫిజియోథెరపీ వైద్యం చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రసవం తరువాత నడుం నొప్పి, మెడనొప్పితో మహిళలు బాధపడుతుంటారు. గర్భం దాల్చినప్పుడు శరీరంలో వచ్చే మార్పులే ఇందుకు ప్రధాన కారణం. అనుభవం ఉన్న థెరపీ వైద్యులతో ఈ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది.
పక్షవాతానికి తిరుగులేని వైద్యం
ఫిజియోథెరపీ పక్షవాతానికి తిరుగులేని వైద్యం అని వైద్యులు చెబుతున్నారు. గతంలో పక్షవాతం వస్తే మనిషి మంచానికే పరిమితం అయ్యేవారు. అయితే థెరపీ కారణంగా ఏడాదిలోపే పక్షవాతం వచ్చిన వారు కోలుకొని తమ పనులు చేసుకోగలుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదిలావుంటే మెదడులో రక్తనాళాలకు రక్తం అందకపోతే నాడి కణజాలం చనిపోయి పక్షవాతానికి దారితీస్తుంది. థెరపీ వ్యాయామాల వల్ల తిరిగి మెదడు తద్వారా కండరాలు పని చేయడం ప్రారంభిస్తాయి.