
గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత
కడప సెవెన్‌రోడ్స్: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం కడప నగరంలోని ఆలయాన్నింటిని మూసివేశారు. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో ఏర్పడింది. ఈ కారణంగా దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 1.50 గంటలకు మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 6.00 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. అలాగే మున్సిపల్ హైస్కూలు వద్దగల శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం, గడ్డిబజారులోని శ్రీ బాలాజీ ఆలయం, బిల్టప్ వద్దగల శ్రీ విజయదుర్గాదేవి ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంతోపాటు ఇతర ఆలయాలను కూడా మూసివేశారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆదివారం మూతపడింది. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రామాలయాన్ని మధ్యాహ్నం 1:50 గంటలకు మూసివేసినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున సుప్రభాతసేవ, ఆలయశుద్ధి, పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం యథావిధిగా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ విజిలెన్స్ అధికారి గంగులయ్య, అర్చకులు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి టౌన్: చంద్రగ్రహణం సందర్భంగా రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని మూసివేశారు. అలాగే పాత రాయచోటిలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం, చెక్‌పోస్ట్ వద్ద వెలసిన శివాలయాలను మూసివేశారు.
ఒంటిమిట్ట రామాలయ ప్రధాన గోపుర ద్వారాన్ని మూసివేస్తున్న దృశ్యం
రాయచోటి శ్రీ వీరభద్రస్వామి
ఆలయ తలుపులు వేస్తున్న అర్చకులు
మూసివేసిన దేవునికడప
శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం

గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత

గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత