
చెరువు మట్టి.. నిలువునా లూటీ !
● రెచ్చిపోతున్న రియల్ మాఫియా
● చేతులు కట్టుకున్న అధికార యంత్రాంగం
సర్కారుతోపు వద్ద హైవే పక్కన రియల్ భూమి చదునుకు తోలుతున్న చెరువు మట్టి
నార్లపల్లె చెరువులో రెండు జేసీబీలు, పలు టిప్పర్లతో మట్టి తరలిస్తున్న దృశ్యం
కురబలకోట : మండలంలోని నార్లపల్లె చెరువును మట్టి మాఫియా కబలిస్తోంది. జేసీబీలు, టిప్పర్లతో యథేచ్ఛగా మట్టితోలి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రోజులుగా చెరువులో జేసీబీలతో టిప్పర్లతో పబ్లిక్‌గా మట్టి తోలుతున్నా అధికార యంత్రాంగం మాత్రం చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నట్లుగా ఉంది. పరిసర గ్రామాల రైతులు నిట్టూరుస్తున్నారు. యథేచ్ఛగా అక్రమంగా చింతమాకులపల్లె సచివాలయం ఎదురుగా హైవే పక్కన ఉన్న రియల్ భూములకు ఈ మట్టి తోలుతున్నారు. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మట్టిమాఫీయాకు మద్దతుగా నిలిచినట్లు చెబుతున్నారు. నాణ్యమైన మట్టి గ్రావెల్ కావడంతో ఈ చెరువు మట్టిని లూటీ చేస్తున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోకపోవడం విడ్డూరంగా వుంది. వా మౌనంపై పరిసర గ్రామాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ మట్టి దూరాభారం బట్టి రూ. 10 వేల నుండి రూ.20 వేల వరకు కూడా పలుకుతోంది. మట్టి తోలడం ఆపకపోతే మట్టి మాఫియాను వారి వెనుక ఉన్న అధికార పార్టీ నాయకుడిని తరిమికొడతామని నార్లపల్లె చెరువుకు చెందిన ఆయకట్టు రైతులు హెచ్చరిస్తున్నారు. తరచూ ఇటుక బట్టీల నిర్వాహకులు కూడా ఈ మట్టిపై కన్నేసి కొల్లగొడుతున్నారు. కొందరు నాయకులు మట్టి తోలి జేబులు నింపుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ చెరువును క్యాష్ మైన్స్‌గా వాడుకుంటున్నారు. పల్లె ప్రాణం చెరువు. ఇలాంటి చెరువును కొల్లగొడుతుండడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు కూడా ఆస్కారం ఇస్తోంది. మట్టి మాఫియా నిర్వాకంపై జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులను విచారించగా చెరువు మట్టి తోలకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చెరువు మట్టి.. నిలువునా లూటీ !