
జేబుదొంగను పట్టించిన వృద్ధురాలు
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవల కోసం వచ్చిన ఓ వృద్ధురాలు.. తన కళ్లముందే కుమారుడి జేబును కత్తిరించి, డబ్బులు కాజేస్తున్న దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఘటన శనివారం పట్టణంలో జరిగింది. సీటీఎంకు చెందిన చినపాపమ్మ(78) అనారోగ్యానికి గురికావడంతో ఆమె ను పెద్దకుమారుడు శంకర మదనపల్లె ప్రభుత్వ జిల్లాఆస్పత్రిలో చూపించేందుకు ఇంటి నుంచి బ యలుదేరారు. అయితే.. శంకర తమ్ముడు భాస్కర, గొర్రెల కోసం తీసుకున్న రూ.70 వేల రుణాన్ని సీటీఎం బ్యాంకులో చెల్లించాల్సిందిగా అన్నకు అందజేశాడు. నగదు తీసుకుని తల్లితో సహా శంకర బ్యాంకుకు చేరుకున్నాడు. అయితే నాలుగో శనివారం బ్యాంకుకు సెలవు కావడంతో, నగదుతో సహా తల్లిని తీసుకుని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నాడు. ఓపీ రాయించేందుకు క్యూలైన్లో నిల్చుని ఉండగా, అప్పటికే శంకరను వెంబడిస్తూ వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడి వెనుక, ముందు నిల్చున్నారు. వారిలో నిమ్మనపల్లెకు చెందిన గోవిందు అనే వ్యక్తి, శంకర నగదు ఉంచుకున్న జేబును చాకచక్యంగా కత్తిరించి చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన వృద్ధురాలు చినపాపమ్మ తెలివిగా వ్యవహరించి, జేబు దొంగ గోవిందును పట్టుకుని కేకలు వేసింది. ఇంతలో అతడితోపాటు వచ్చిన ఇద్దరు అక్కడి నుంచి పరారు కాగా, సెక్యూరిటీ సిబ్బంది జేబుదొంగను అదుపులోకి తీసుకుని అతడు దొంగిలించిన రూ.70వేల నగదును శంకరకు అందజేశారు. దొంగ గోవిందును అవుట్‌పోస్ట్ సిబ్బంది టూటౌన్ పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలు చినపాపమ్మ ధైర్యం, చొరవను ఆస్పత్రి సిబ్బంది అభినందించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో నగదు కాజేస్తుండగా పట్టివేత
రూ.70 వేల నగదు సురక్షితం