
హత్యాయత్నం కేసులో పదేళ్ల జైలుశిక్ష
మదనపల్లె రూరల్ : అమ్మాయి విషయమై జరిగిన గొడవలో కక్ష పెంచుకుని ఓ వ్యక్తిపై హత్యా యత్నం చేసిన నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధిస్తూ సోమవారం మదనపల్లె 7వ అడిషనల్ జిల్లా కోర్టు జడ్జి శ్రీలత తీర్పు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం నక్కబండ ఇస్లాంనగర్‌కు చెందిన రాజా అలియాస్ తోటిరాజేష్(22) అదే ప్రాంతానికి చెందిన ఫారుఖ్‌తో ఒక అమ్మాయి విషయంలో గొడవ పడ్డాడు. దీంతో రాజేష్, ఫారుఖ్‌పై కక్ష పెంచుకుని చంపాలనే ఉద్దేశంతో 2022 జూన్ 25వ తేదీ సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో నక్కబండలో పంచాయతీలో ఉన్న అతడిపై కత్తితో కడుపుపై పొడిచి హత్యా యత్నం చేశాడు. ఘటనపై పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మోహన్‌కుమార్ క్రైమ్‌నెం.211/2022 కింద 307 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి రాజాను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం మదనపల్లె 7వ అడిషనల్ జిల్లా కోర్టులో విచారణ ముగియడంతో న్యాయమూర్తి శ్రీలత, ముద్దాయి రాజాకు పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసులో అడిషనల్ పీపీ జయనారాయణరెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడికి శిక్ష పడేందుకు కృషిచేసిన ఎస్‌ఐలు మోహన్‌కుమార్, సుబ్బారెడ్డి, కోర్టు కానిస్టేబుల్ ప్రవీణ్‌కుమార్, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, సిబ్బందిని చిత్తూరు ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు ప్రత్యేకంగా అభినందించారు.