
పోలీసు శాఖలో అత్యాధునిక వ్యవస్థ సీసీటీఎన్‌ఎస్
రాయచోటి : సీసీటీఎన్‌ఎస్ పోలీసు పనితీరును సమూలంగా మార్చే అత్యాధునిక వ్యవస్థ అని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఐటీ కోర్ టీమ్ కార్యాలయంలో పోలీసు సిబ్బందికి నాలుగు రోజుల క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ ఫౌండేషన్ కోర్సును జిల్లా ఎస్పీ ప్రారంభించారు. నేడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ ఫౌండేషన్ కోర్సు జిల్లా పోలీసు విభాగంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని ఎస్పీ అభిప్రాయపడ్డారు. సీసీటీఎన్‌ఎస్ ద్వారా నేరాల దర్యాప్తును, నేరగాళ్ల గుర్తింపును, సమాచార మార్పిడిని మరింత వేగంగా, సమర్థవంతంగా చేయగలుగుతామని తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక నైపుణ్యాలు చాలా అవసరమన్నారు.
అపకోప్స్, మొబైల్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్..
పోలీసు స్టేషన్లకు సంబంధించిన సమాచారం, ఎఫ్‌ఐఆర్ కాపీలు తదితర విషయాలు ఎవరికి పడితే వారికి చేరవేసేలాగా దుర్వినియోగం కానివ్వకుండా ఆధునిక సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపా రు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుండి ఆల్ ఇన్‌వన్ కంపాక్ట్ డిస్క్ టాప్స్ 136, ప్రింటర్లు 39, వెబ్ కామ్స్ 34, జిల్లాకు కేటాయించారన్నారు. ప్రతి పోలీ సు స్టేషన్‌కు నాలుగు చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవస్థను ఎంత బాగా ఉపయోగిస్తే ప్రజలకు అంత మంచి సేవలను అందించగలమని ఎస్పీ సిబ్బందికి అవగాహన కల్పించారు.