
టీడీపీలో కుమ్ములాట
● రైల్వేకోడూరులో తారా స్థాయికి విభేదాలు
● రాజంపేటలో నేతల మధ్య వర్గ పోరు
● రాయచోటిలో మంత్రి, సుగవాసిల మధ్య పెరిగిన దూరం
● తంబళ్లపల్లెలో కుదరని సమన్వయం
● ఇన్‌చార్జి మంత్రికి తప్పని తమ్ముళ్ల తలనొప్పి
సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారులో ఆధిపత్య పోరు మొదలైంది. నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఇన్‌చార్జిగా ప్రకటించిన నేతకు బాగా పలుకుబడి ఉంటుందన్న కారణంతో పోరు సాగుతోంది. ఎన్నికల ముందు అంతంత మాత్రంగా ఉన్నా... అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టు కోసం ఒకరిపై మరొకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. మరో పక్క ఆర్థికంగా బలపడేందుకు.. అధికారులతో పని చేయించుకునేందుకు పదవి అన్నది కీలకంగా మారింది. దీంతో ఇంతకు మునుపు వరకు కలిసికట్టుగా ఉన్న నేతల్లో.. ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి నెలకొంది. అఽధిష్టానం మాత్రం ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇంతవరకు ఇన్‌చార్జిలను కూడా ప్రకటించలేని దుస్థితిలో ఉండగా.. తమ్ముళ్ల మధ్య తగువులాటలు యథా రాజా.. తథా ప్రజా అన్నట్లుగా జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట రైల్వేకోడూరు, రాజంపేటలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాల్లో కూడా జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్దన్‌రెడ్డి ఎదుటే తమ్ముళ్లు యుద్ధ చేయడంతో ఆయన తల పట్టుకోవాల్సి వచ్చింది.
రూపానందరెడ్డి తీరుపై
ప్రత్యర్థి వర్గం బహిరంగ యుద్ధం
జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలో అధికార పార్టీ టీడీపీలో కుమ్మలాటలు తారా స్థాయికి చేరాయి. ఎన్నికలకు ముందు టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న కస్తూరి విశ్వనాథనాయుడును పక్కనపెట్టి.. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన రూపానందరెడ్డికి టీడీపీ ఇన్‌చార్జిగా అధిష్టానం పట్టం కట్టింది. అంతేకాకుండా అధికారంలోకి రాగానే రూపానందరెడ్డికి అడ చైర్మన్‌గా అవకాశం ఇస్తూ పెద్దపీట వేశారు. మరోపక్క ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలుపు కోసం పని చేసిన విశ్వనాథనాయుడుతోపాటు మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులును పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో కార్యకర్తలు రగలిపోతున్నారు. ఆది నుంచి పార్టీ కోసం పని చేసిన వారిని కాకుండా.. కొత్తగా వచ్చిన వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారంటూ వర్గాలు యుద్ధ వాతావరణం సృష్టించాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నా.. పెత్తనమంతా రూపానందరెడ్డి కుటుంబమే చేస్తున్నదని రగలిపోతున్న ప్రత్యర్థి వర్గాలు ఇన్‌చార్జి మంత్రిని చూడగానే రెచ్చిపోయాయి. మాజీ ఇన్‌చార్జితోపాటు మాజీ ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత తగ్గించడంపై పార్టీ శ్రేణులు మంత్రి ఎదుటే దాడికి దిగారు. టీడీపీ కార్యాలయంలోని అద్దాలతోపాటు కుర్చీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అంతేకాకుండా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యే శ్రీధర్ రావడాన్ని కూడా తీవ్ర స్థాయిలో ప్రత్యర్థి వర్గాలు ఆక్షేపించాయి. రైల్వేకోడూరు టీడీపీలో మూడు వర్గాల మధ్య ప్రచ్చన్నయుద్ధం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిిస్థితికి వచ్చింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలోనే తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు, తోపులాట పరిస్థితి చూసిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తంబళ్లపల్లెలో ఇన్‌చార్జి రగడ
జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య ఇన్‌చార్జి వ్యవహారం రగులుతోంది. ఒకపక్క మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన జయచంద్రారెడ్డి.. ఆది నుంచి పార్టీ కోసం పని చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గాల మధ్య రచ్చ ముదిరింది. ఇటీవల ములకలచెరువు, తంబళ్లపల్లె, బి.కొత్తకోట ప్రాంతాల్లో వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని మంత్రి లోకేష్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ ఒక వర్గం చింపివేసి కేకులను విసిరి కొట్టారు. లోకేష్ జన్మదినం సందర్భంగా రెండు వర్గాల మధ్య ముష్టి యుద్ధం చోటుచేసుకుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు చోటుచేసుకుంటున్నా తంబళ్లపల్లెను మాత్రం అధిష్టానం గాలికి వదిలివేయడంపై కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీలోని కొన్ని వర్గాలు పని చేస్తున్నాయి. ఏది ఏమైనా అన్ని నియోజకవర్గాల్లో కూటమిలో కుమ్మలాటలు తారాస్థాయికి చేరాయి.
రాయచోటిలో రగులుతున్న అసమ్మతి
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కీలక నేతల మధ్య దూరం పెరిగింది. ప్రస్తుత రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటిలో మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారులకు ప్రాధాన్యత తగ్గించారని ఆ వర్గం రగిలిపోతోంది. రాజంపేటలో పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం తర్వాత మంత్రిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి సుగవాసి, మండిపల్లి మధ్య దూరం పెరిగింది. అంతేకాకుండా ఇటీవల ముఖ్యమంత్రి సంబేపల్లెకు వచ్చిన సందర్భంలోనూ బాలసుబ్రమణ్యం కలిసేందుకు ప్రొటోకాల్ లిస్టులో పేరు లేకుండా చేశారని ఆ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కూడా ఆహ్వానం లేనట్లు తెలుస్తోంది. మరోపక్క అన్నకు జరుగుతున్న అవమానాలపై టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉన్న ప్రసాద్‌బాబు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. రాయచోటిలో కూడా అటు మండిపల్లి, ఇటు సుగవాసి కుటుంబాల మధ్య పొరపచ్చాలు రావడంతో కార్యకర్తలు కూడా వర్గాలుగా విడిపోయారు.
రాజంపేటలో రచ్చరచ్చ
రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఒకవైపు జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు, మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యం వర్గాల మధ్య పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. రాజంపేటలో గత ఆగస్టులో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా రిబ్బన్ కత్తిరించే విషయంలో కీలక నేతలైన జగన్‌మోహన్‌రాజు, బాలసుబ్రమణ్యంలు తోసుకోవడంతో .. అప్పటి నుంచి కార్యకర్తల్లో కూడా భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఇన్‌చార్జి మంత్రి సమక్షంలో జరగాల్సిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు యుద్ధం చేశారు. ఒక పక్క టీడీపీ ఇన్‌చార్జిగా రాజంపేట నుంచి పోటీ చేసిన బాలసుబ్రమణ్యంకు అప్పగించాలని పలువురు డిమాండ్ చేశారు. మరోపక్క జగన్‌మోహన్‌రాజు వర్గం నేతలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యకర్తలు అందరూ లోపల ఉండాల్సిందేనంటూ ఒకరునొకరు తోసుకోవడంతో రాజంపేటలోనూ గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతున్నా.. ఇప్పటికీ ఇన్‌చార్జిని నియమించలేక అధిష్టానం సాగదీస్తోంది.

టీడీపీలో కుమ్ములాట