
● వసతి గృహం కాదు..శిథిల గృహం
రాజంపేట టౌన్ : ఏదైనా ఒక భవనం కాలపరిమితి యాబైఏళ్ళు ఉంటుంది. యాబై ఏళ్లు పూర్తయిన భవనాలు బాగున్నా వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఎందుకంటే యాబై ఏళ్ల క్రితం పిల్లర్లు లేకుండా భవనాలను నిర్మించేవారు. ఈ భవనాల పటిష్టత కాలం గడిచే కొద్ది దెబ్బతింటుంది. ఈకారణంగా పెద్ద, పెద్ద నగరాల్లో యాబై ఏళ్లు దాటిన ఇళ్లు, భవనాలను అధికారులు యజమానులకు నోటీసులు జారీ చేసి కూల్చివేయిస్తారు. ఇదిలా ఉంటే రాజంపేట పట్టణం వత్తలూరురోడ్డులో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ శిధిలావస్థకు చేరుకొని కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ హాస్టల్‌ను 1972లో నిర్మించారు. హాస్టల్‌ను నిర్మించి 53 సంవత్సరాలయింది. అందువల్ల హాస్టల్ అంతా పూర్తిగా దెబ్బతినివుంది. ఈహాస్టల్‌లో మొత్తం 18 గదులు ఉన్నాయి. అందులో 14 బాగా దెబ్బతిన్నాయి. కేవలం నాలుగు గదుల్లో మాత్రమే విద్యార్థులు ఉంటున్నారు. ఈనాలుగు గదుల్లో కూడా శ్లాబు పెచ్చులూడి పడుతుంటాయి.